పుట:కాశీమజిలీకథలు-05.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

179

గావింపుము. వాండ్రకు నేను మంత్రబద్దుండనగుటచేఁ బ్రత్యక్షమైతినికాని ధర్మముచేతఁ గాదు సుమీ యని పలుకుచు నద్దేవుండంతర్హి తుండయ్యెను.

అప్పలుకు లాకర్ణించి వటుకప్రముక కాపాలికులు విస్మయము నొందుచు శంకరాచార్యుపాదంబులఁబడి మహాత్మా! మూఢమతులమగు మమ్ము రక్షింపుము రక్షింపుము కరుణాహృదయా! మాకు నిష్కృతిఁ గావింపుమని ప్రార్ధించినంత నప్పుణ్యాత్ముండు వారినెల్ల బ్రాహ్మణాచార తత్పరులం గావింపుఁడని పద్మపాదాది శిష్యుల కాజ్ఞాపించెను.

కాపాలిక మతము

అప్పుడు వృద్దకాపాలికుఁడొకడవ్వార్త నాలించి వటుకాదుల నాక్షేపించుచు శంకరాచార్యునెదుటకువచ్చి నమస్కరింపుచు స్వామీ! మీకు మమ్ము బలత్కారముగా మతభ్రష్టుల జేయుట యుచితముకాదు తగుసమాధానముఁజెప్పి యొప్పించవలయును. మామకమత ప్రవృత్తి లెస్సగా వినిన పిమ్మట నాక్షేపించినను సమంజసమగును నీశిష్యుల మూలమున నేమాటజెప్పుటకు నవకాశములేకున్నది. నోరెత్తువఱకు మొత్తుచుందురు. ఇది ప్రసంగపద్ధతికాదు దౌష్ట్యమని చెప్పుకొనుచున్నాను. ఇప్పుడు నేను మీఁతో నెంతయోచెప్పవలసివచ్చితిని నా యుపన్యాసము ముగియువఱకు మీ శిష్యుల నాటంకము సేయకుండ నాజ్ఞాపింపుడు. ఇదియే నా కోరిక యని చెప్పుకొనియెను.

ఆ మాటలు విని యతీంద్రుండు మందహాసము సేయుచుఁ గాపాలిక ! మా శిష్యులనియమించితిని. నీయుపన్యాసమేదియో వినిపించుమని యానతిచ్చినంత నాకాపాలికుం డిట్లనియె.

మీరు మనుష్యులలో జాతిభేదములం జెప్పుచు బ్రాహ్మణజాతి యెక్కుడని వాదించుచున్నారు. అందులకు మేముసమ్మతింపము. సర్వదేహములు భౌతికవికారము లగుటచే జాతిభేద మెట్లు చెప్పఁదగినది. శరీరమునుఁజూచి మీరు జాతినిర్ణయింపఁగలరా? స్వకల్పితములగు నీజాతిభేదములకుఁ బ్రమాణము గానిపించదు. స్త్రీపురుష జాతులుఁ రెండే యొప్పుకొనదగినవి. దేనిసంసర్గవలన నెక్కుడు సంతోషము గలుగుచున్నదో, యట్టిస్త్రీజాతి పురుషజాతికన్న శ్రేష్ఠతమమని చెప్పకయే తేలుచున్నదిగదా. ఇది స్వీయ ఇది పరకీయ దీనింగూడవచ్చును. దానిఁ గూడరాదను భేదవాదము మా మతములో లేదు. అందఱిని దనవారిగా నెంచి యిష్టమైన యానంద మనుభవింపవచ్చును.

సంతసముకొఱకు గావించెడు చరమయదేహముల సంయోగమువలన జీవిఁ డేమియనర్ధమునఁ బొందెడిని? అట్టి యానందము గలుగఁజేయు స్త్రీపురుషసంయోగము కన్న మోక్షమనునది మరియొకటి కలదా! జీవునియొక్క తృప్తియే మోక్షమనఁబడుచున్నది. సంయోగంబున నానందరూపమగు నెట్టివ్యక్తిగలుగుచున్నదో యట్టివ్యక్తి యే