పుట:కాశీమజిలీకథలు-05.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

177

అప్పు డయ్యభినవపరాభవంబు సైపరింపక యక్కా పాలికుం డోష్ఠంబులు చలింప వికటముఖుండై పటుకోపంబునఁ బరశ్వధంబు గిరగిరంద్రిప్పుచు మీ శిరస్సు లన్నియు నరికి భైరవునర్చింపకుండిన నేను క్రకచుండఁగానని శపథముచేసి తటాలునం జని బ్రహ్మణబ్రువుల వధించిరండని కపాలిలోకంబుల నియమించెను.

ప్రళయమేఘగర్జారావములతో గపాలిసంఘంబులు పెక్కులొక్కసారి నానావిధాయుధంబులంబూని యాబ్రాహ్మణ బృందమును ముట్టడించుటయు సుధన్వుండు రధికుండై కోదండంబుదాల్చి కాండవర్షంబు గురిపించుచు నక్కా. పాలిక తండంబులతో భండనంబు సేయుచున్న సమయంబున.

క. కక్రచునియుక్తులు కాపా
   లికులొకపదివేలు భువి చలింపంగా వే
   ఱొకత్రోవవచ్చి విప్ర
   ప్రకరములను జుట్టిబెట్టు బాధించె వెసన్.

సీ. జపతపోనుష్ఠాన సత్క్రియల్గాక బ్రా
           హ్మణుల కేటికియుద్ధ మనెడివారు
    సకలసంగత్యాగి సన్యాసికేటికి
           ఘనదిగ్విజయయాత్ర యనెడువారు
    సాధులబోధింపఁ జనుఁగాని యతికి దు
           ర్జనభర్జనంబేటి కనెడివారు
    అటనుండియింటి కేగుటమాని యిటకేల
           వచ్చితిమనిచింతఁ జొచ్చువారు.

గీ. నైమహీసురులెల్ల భయంబుతోడ
   బ్రహ్మసూత్రములూడ దోవతలువీడ
   పారి శంకర ! మాంపాహి పాహియనుచు
   శరణుజొచ్చిరి యతినాధు చరణయుగము

అట్లు శమనకింకర నీకాళములగు కాపాలికానీకములుగావించు రాయిడికోడి బాడబులెల్ల నయ్యతితల్లజుని పాదపల్లవముల మరుగుఁ జొచ్చుటయు నాదయాళుండు వారినెల్ల నాదరింపుచుఁ బ్రళయకాలవారి వాహనిర్ఘోష భయంకరమగు హుంకారము గావించె. దానంజేసి చటచ్చటారావముటతో విస్ఫులింగము లురుల నావిర్భవించిన వీతిహోత్రుండు త్రుటికాలములో నాకాపాలికులనెల్ల భస్మానశేషులుఁ గావించెను.