పుట:కాశీమజిలీకథలు-05.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

కాశీమజిలీకథలు - ఐదవభాగము

విద్యు — చిత్తము. చిత్తము. అంతయు సిద్ధము గావింతునని పల్కుచు నందరు నిష్క్రమించుచున్నారు.

శంకరాచార్యులట్లు కాంచీపురంబున విచిత్రగోపురమంట పాలయ ప్రాకారాదులం గట్టించి యచ్చటనుండి వేంకటాచలముమీదుగ విదర్భరాజధాని నలంకరించి యందుండి కాపాలిక కులసంబగు కర్ణాటదేశంబునకుం జనిరి.

అందొక దేవాగారంబున వసియించి తద్దేశవాస్తవ్యులనెల్ల నద్వైతమతావలంబకులం గావింప బోధించి యా సమయంబున సుధన్వప్రేషితుం డై శంకరాచార్యుని శిష్యుఁడొకఁడు క్రకచు నొద్దకు బోయి సావలేపముగా !

సీ. కుమతవాద్యున్మత్త కుంభికంఠీరవుం
              దాగమశీర్ష తత్త్వార్ధవేది
    దర్శితాద్వైత విద్యా రహస్యవిశేషుఁ
             డఖిలదిక్చయతట వ్యాప్తకీర్తి
    యంగభూగర్వ ప్రభంగపావనమూర్తి
             ప్రౌడార్ధయుతసూత్ర భాష్యకర్త
    ఘనవాదజి తపంకజ భూకళత్రుండు
             సమధికకారుణ్య సాగరుండు.

గీ. సకలవేదపురాణ శాస్త్రప్రసంగ
   చతురమతిశంకరాచార్య చక్రవర్తి.
   యిందువిచ్చే సెఁ గకచ ! వాదేచ్చనీకుఁ
   గలిగెనేనిఁ బ్రసంగింపఁ గదలిరమ్ము.

అని చదువునంత నక్కుటిలుండు కటకటంబడి కటంబులదరి జటుల భ్రుకుటీ వికటముఖుండై శూలకపాలంబులు గేలందాలిచి యతిరయంబున నయ్యతిపతి నికటంబున కరుదెంచి యుల్లసమాడుచు నిట్లనియె.

పురుషాధమా! నీవు కపటమతంబొకటి కల్పించి లోకులవంచించుచున్నావని యాకర్ణించి నీదర్పంబడంప నీ కడకు రానుంటిని లోకం నగ్నిజ్వాలంబడు మిడుత చందంబున నీవే నా యొద్ద కరుదెంచితివి.

నీవుభసితంబుదాల్చితి విదిమాకు సమ్మతమే కాని పరమపవిత్రంబగు నరశిరః కపాలము విడిచి యీమట్టిపాత్ర దాల్చితివేల ? భైరవార్బ నేమిటికిజేయవు? రుధిరాక్తములగు కపాలకుశేశయములచే భైరవు నారాధింప నీకు మోక్షము దొరకునా? యీచెడు మతమువిడిచి మాకాపాలికమతము స్వీకరింపుము. ముక్తుండవయ్యెదవని పలుకుచుండఁగా విని సుధన్వుండు తనయధికారులచే నాక్రకచుని నాసభనుండి దూరముగా ద్రోయించెను.