పుట:కాశీమజిలీకథలు-05.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

175

కౌక్షేయకుఁడు — అగుంగాబోలు. వినుం డప్పుడా వీరుండు కేలనున్న కోదండంబు దీటుచు

మ. భయమేలా ? యతిపాలసేవకుఁడ నీ భక్తుండ నేనుండ వి
     స్మయమేపార మదీయబాహుగధ నుజ్జ్యాముక్తబాణావళిన్
     లయమొందింతుఁ గపాలిసంఘముల నెల్లంబట్టి తద్భీకరా
     వయవంబుల్గుతుకంబుతో ఖగకుల వ్రాతంబు భక్షింపఁగాన్.

క్రకచుఁడు — అన్నా ! యన్నీచుఁ కండకావరమెట్లు ప్రేలించుచున్నది. కానిమ్ము తదీయమస్తకరుధిర మాధుర్యంబు భగవంతుఁడగు భైరవుండెరుగనున్నాఁడులే. తరువాత తరువాత.

కౌక్షేయకుడు — అన్నరపతి మాటలు విని యయ్యతిపతి మందహాసము చేయుచుఁ గాపాలికులం జయింపఁ గర్ణాటదేశంబునకుఁ బయనంబు సాగింపుఁడని శిష్యులకానతిచ్చెను.

క్రకచుఁడు — మేలు మేలు. సాధు. సాధు. కౌక్షేయకా! మంచివార్త చెప్పితివిగదా ఆ ప్రయాణ సన్నాహము తుదముట్టసాగినదా నడుమ విఘ్న మేదియైన రాదుగద

కౌక్షేయకుఁడు — రాదు. రాదు. వారు బయలుదేరి పెక్కుదూరము వచ్చు వరకు నేనక్కడనే యుంటిని. పదివేల బ్రాహ్మణులతోఁ జతురంగబలసమేతుఁడగు సుధన్వుఁడను నరపాలుఁడు సేవింప నా సన్యాసి మనదేశమునకు వచ్చుచున్నాఁడు. తరువాతి కృత్యము విచారించుకొనుఁడు. అందరివలె నయ్యతి శేఖరుని సామాన్యముగా దలంపవలదు సుఁడీ.

క్రకచుఁడు - కౌక్షేయకా ! నీ వతని స్తోత్రములు చేయుచు నాకు వెరపుఁ జూ పెదవేల ? చాలు. చాలు. పోపొమ్ము. విద్యుజ్జిహ్వా ! ఆ సన్యాసి మనదేశమునకే వచ్చుచున్నాఁడఁట. వింటివా?

విద్యుజ్జిహ్వుఁడు - వింటిని. ఆ బ్రాహ్మణుల యాయువులు మూడినవి కాఁబోలు. పాపము వాండ్రు మనతో విద్యావాదములు చేయు తలంపుతో వచ్చు చున్నారు. ఆ సంగరహితులతో మనము సంగరమా ప్రసంగమా చేయునది ?

క్రకచుఁడు -- -వారు సంగరహితులని నీవే చెప్పుచున్నావు. ప్రసంగములు మనకేల ? సంగరము చేయుదము. మన కాపాలికుల నెల్ల యుద్ధసన్నద్ధులై యుండుఁ డని యాజ్ఞాపింపుము.

గీ. బోడిబాపనయ్య లీడకువచ్చిన
   తోడమూగిమనము తొడలు మెడలు
   విరుగనరికినవారి శిరముల సురనిడి
   భైరవుని దృప్తి పరుపవలయు.