పుట:కాశీమజిలీకథలు-05.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కౌక్షేయకు — చిత్తము. అతండా కాంచీపురంబున హరిహరులకు నద్భుతమైన యాలయప్రాకార మంటపాదులఁ గట్టించి యందందనేక భూసురసమాజముల నివసింపఁజేసెను.

క్రకచు - తరువాత.

కౌక్షెయ — పదివేలమంది శిష్యులతో నచ్చటినుండి కదలి వేంకటాచలమునకు వచ్చి యందు మూడుదినములుండి తరువాత విదర్భ రాజధానిం జేరిరి.

క్రకచు — ఓహో? మేకపిల్ల పులియున్న పొదదాపునకే వచ్చుచున్నదే. తరువాత తరువాత.

కౌక్షేయ — అయ్యతిశేఖరుండు సపరివారముగా నావిదర్భ నృపాలునిచే నర్చితుండై తద్దేశజనుల కామోదము గలుగఁజేయుచు నందుఁ బదిదినములు వసించెను.

క్రకచుఁడు — వానిదాంభికము చక్కగా సాగుచున్నదే. తరువాత తరువాత.

కౌక్షేయకు — అప్పుడు దేవరయౌద్ధత్యంబు శంకరుని కర్ణగోచరమగుటయు మన దేశమునకు రాఁ బ్రయాణమగుచున్న యతని యుద్యమము వారించుచు విదర్భ నృపాలుండు.

క్రకచుడు — ఏమి వాని సాహసము. రానిమ్ము. రానిమ్ము.

చ. అకట మదీయతాంత్రిక మహత్త్వము తెల్లముగాఁగ వాని మ
    స్తకమురుశూలధారదళితంబుగఁ జేసి సురన్ ఘటించి యం
    దకలుషప్రవృత్తిభైరవున కాహుతిగా నొనరింపఁకుండినన్
    గ్రకచుఁడటంచు నన్బిలువ గాఁదగదింకిట మీరలెవ్వరున్.

కానిమ్మట్టితరి నా నృపాలుం డాబోడి సన్యాసితో నేమని చెప్పెను ?

కౌక్షేయకు — వినుండు.

ఉ. భైరవతంత్రపారగులు పాపమతుల్ దురితక్రియారతుల్
    క్రూరులు బాలిశుల్కల హ కోవిదు లచ్చటివారు భీకరా
    కారులు వేదదూషకులు గావున మీరటకేఁగరాదు తే
    జోరహితుల్ యశస్కరులఁ జూచి సహింపరుగా ధరిత్రిలోన్.

క్రకచుఁడు — ఏమేమీ ! విదర్భ నృపాలుండు మనలఁ గ్రూరులగాను, తేజోరహితుల గాను వర్ణించి యాడాంబికుని నుత్తమునిగాఁ గొనియాడెనా ? కానిమ్ము! భైరవతంత్రప్రభావం బెరింగిన పిమ్మట నిట్లనఁడులే. తరువాత. తరువాత.

కౌక్షేయకు — ఆ మాటలు విని శంకరసన్యాసి యందొకవంక ధనుర్ధరుండై సేవించుచున్న సుధన్వుండను నృపాలు మొగముపరిక్షించెను.

క్రకచ్చు - ఆ మహావీరుండతని సహాయుండా యేమి ?