పుట:కాశీమజిలీకథలు-05.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

173

మిగుల జంఝాటముతో రామేశ్వరాది క్షేత్రములఁ దిరుచుగున్నాఁడని మనము వింటిమి గదా.

విద్యుజ్జిహ్వుఁడు — స్వామి! వినుటయే కాక వానిమీద దండెత్తుటకై యస్మన్మిత్రులగు క్షపణజైనబౌద్ధాదిమతస్థులకు వార్తలనంపి వారినందఱను రప్పించితిమి. వారందరు వానితోఁ బోరెప్పుడు గలుగునని యుఱ్రూటలూరుచున్నారు.

క్రకచుఁడు — ఆ మాయావి వృత్తాంత మరసి రమ్మని పంపిన కౌక్షేయకుఁ దరిగివచ్చెనా ?

విద్యు - ఇదిగో ! వాడిప్పుడే వచ్చెను. ఆ కథవినిపించుటకే వాని మీ యొద్దకుఁ దోడ్కొనివచ్చితిని. (అని వానిముందరికిఁ ద్రోయుచున్నాఁడు.)

క్రకచుఁడు —— కౌక్షేయకా ! యిప్పుడా కుక్షింభరి యెందున్నవాఁడు ? వానిచర్య లెట్లున్నవి? ఎవ్వరేని వానిం బరిభవించిరా ?

కౌక్షేయకుఁడు — స్వామి! దేవరగాక యాసన్న్యాసిని బరిభవించువాఁ డీపుడమిఁలేడు. వాని ప్రభుత్వము నిరాటంకముగా సాగుచున్నది. వినుండు నేను వానిఁ గాంచీపురంబులో నుండఁగలసికొంటి.

క్రకచకుఁడు — అచ్చటి విశేషములేమి?

గౌక్షేయ — చెప్పెద నాకర్ణింపుఁడు.

సీ. ఒకవంకలోక నాయకులోలి సకలంక
        నుతిఁదత్పదార్చనా రతిభజింప
    నొకచాయసువినేయ నికరమామ్నాయాంత
        సంప్రదాయార్ధముల్ చర్చ సేయ
    నొక క్రేవయుక్తి ప్రయుక్తులబద్ధులై
        కుమతవాదులు తదంఘ్రులనుబఁడగ
    నొకమూలమూల వాక్యోపదేశజ్ఞాత
        తత్త్వులై జనులు నృత్యములు సేయ.

గీ. నందఱకు నెన్ని రూపులై యాత్మబోధ
    నాచరింపుచు విప్ర సభాంతరమునఁ
    బ్రమథ వితుఁడగు భావభవవిరోధి
    కరణి నొప్పారి నప్పారికాంక్షియెపుడు.

దేవా ! యా సన్యాసి బ్రాహ్మణసభాంతరాళంబున వసించి యుపన్యసింపు చుండ నతనితేజము దుర్నిరీక్ష్యంబై యుండుఁగదా.

క్రకచుఁడు:— మూర్ఖా ! యీ స్తోత్రపాఠములు నాదగ్గరఁజేసెద వేమిటికి చాలు. చాలు. తరువాత నచ్చట నతండు గావించిన చర్యలం జెప్పుము.