పుట:కాశీమజిలీకథలు-05.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

171

శ్రు॥ సురాం నైవపిబేత్ నైవపరదారాన్ గచ్చేత్. కల్లు తాగఁగూడదు పరదారలగూడఁ గూడదని శ్రుతులుఘోషింపుచుండ వానివలన ము క్తిగలుగునని చెప్పుచుంటివి. ఆహా నీపాండిత్యము, నకర్మణా. అను శ్రుతి కర్దమేమియో యెరుంగుదువా? అది తత్వవేది యగు యతినిమిత్తము చెప్పఁబడినదికాని మీబోటులకు గాదు. పాపాత్ములు నరకార్హులుఁ నీవుపతితుండవుఁ ప్రాయశ్చిత్తము కావింతుము. నంచపూజాపరాయణుండవుకమ్ము. అజపాదమంత్రంబుల జపింపుము. ముక్తుండవయ్యెదవని చెప్పి ప్రాయశ్చిత్తపూర్వకముగాఁ దత్త్వోపదేశముఁజేసి వారి మతస్థులతోఁగూడ శిష్యునిఁగా జేసికొనియెను.

అట్లె తక్కిన మూడు మతములవారునువచ్చి యాచార్యునితోఁ బెద్దతడవు వాదించి తదీయో క్తి ప్రహరణములచే గొట్టఁబడి శిష్యులై సేవించిరి. అట్లు శంకరాచార్యులు క్రమంబున శాక్తశైన వైష్ణవ సౌరగాణాపత్యమతంబుల ఖండించి తద్దేవతల బంచాయతనము లనిత్యముఁ బూజించుకొమ్మని యుపదేశించి వారెల్ల శిష్యులై సేవింపుచు దోడరా నటకదలి కాంచీపురంబునకరిగిరి. అందమ్మహాత్ముండు శిష్యులతోఁకూడ నొక మాసమువసించి శంకరప్రతిష్టాపూర్వకముగా శివకాంచియను పట్టణముగట్టించి తత్సేవకై పెక్కండ్ర బ్రాహ్మణుల రప్పించి శుద్ధాద్వైతబోధఁ గావించి వేదాంత తాత్పర్యనిష్టులై యొప్ప నందు నిలిపెను. ఒకనాఁడు తామ్రపర్ణీ తీరమునుండి కొందరు బ్రాహ్మణులరుదెంచి గురువువరుని చరణంబులకు నమస్కరింపుచు నిట్లనిరి. స్వామీ యీలోకంబున దేహాదులకు భేదము ప్రత్యక్షముగా గనంబడుచున్నది. పరలోకంబున సైతమా మా యీకర్మలవలన నాయా యీ దేవతలనుపాసించుటచే నాయా యీ లోకములు కలుగునని వినుచుండుట భేదమే నిజమైనట్లు తోచుచున్నది. అభేదవాదనకు నిదర్శనమేమని యడిగిన నాచార్యుం డిట్లనియె.

విప్రులారా ! పరమార్ధతత్త్వము దెలియకపోవుటచే మీరిట్లంటిరి. వినుండు.

శ్రు॥ యత్రత్వస్యపరమాత్మై వాభూతత్కేన కంపశ్యేత్ అను శ్రుతి ప్రమాణమువలన దత్త్వజ్ఞానాగ్నిచే దగ్ధమగు పాపపంజరముగలవానికి ముక్తిదశయందు భేదభావము దెలియఁబడును.

శ్రు॥ తత్సృష్ట్వాతదేవాను ప్రావిశత్॥

అను ప్రమాణమువలన జగత్కర్తయగు పరమాత్మయే జీవరూపముగా జగములో బ్రవేశించెనని స్పష్టమగుచున్నది. మరియు దేవతలెందఱని శంకించికొని మువ్వురా ? మూడువందలా! మూడువేలా ? ముప్పదిమూడువేలా ? ముప్పదిమూడు కోటులా ! యని యనేకత్వము నిరూపించుకొని యంతర్భాగక్రమంబున నొక్కఁడే దేవుఁడని నిశ్చయింపబడినది. మొదట బ్రహ్మకే యనేకత్వము జూపఁబడిఁనదిగదా.

శ్రు॥ బహుస్యాంప్రకాయేయేతి. అనిశ్రుతిచే భోక్తృభోగ్యాత్మకమగు సకల ప్రపంచకమునకుఁ బరమాత్మరూపత్వము ప్రతిపాదింపఁబడినది కావున సర్వజ్ఞు నిత్య శుద్ధబుద్ధస్వభావు సకలవివర్తాధిష్ఠాను బరబ్రహ్మను ముముక్షువులుపాసింపఁదగినది.