పుట:కాశీమజిలీకథలు-05.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

కాశీమజిలీకథలు - ఐదవభాగము

హరిద్రాగణపతియే జగత్కారణుండు. బ్రహ్మాదు లాయన యంశంబున జనించిరి. మీరుకూడ నమ్మహాత్ముని సేవించినఁ గృతార్ధులగుదురు. తుండైకదంతాకారములగు లోహంబుల భుజంబులంజిహ్నలుంచుకొనిన ముక్తిరాకుండున్నాయని పలికిన నవ్వుచు గురుండిట్లనియె, మూఢా! తుండాకారములగు లోహంబున గట్టిగఁ గాల్చి కొంటినేని తప్పక నీకు శరీరమోక్షము గలుగుట కెంతమాత్రము సందియము లేదు. గణాధిపతి జగత్కర్తయగుంగాక సర్వనామములు నమ్మహాత్మునికిఁ జెల్లును. అతఁడు రుద్రసుతుండగుట నశాంశులకభేదముఁ జెప్పవచ్చును. ఎల్లవారు గణపతి నుపాసింపఁ దగినదే అందుల కేమియు నాక్షేపము లేదు. బ్రాహ్మణులకు గణేశాదిపంచాయతన పూజ విధింపఁబడియున్నది. కాని చిహ్నధారణము కడుదూష్యము. దాన బ్రాహ్మణ్య హాని యగునని బోధించి వారిని స్వమతప్రవర్తకులం గావించెను.

అప్పుడుచ్ఛిష్టగణపత్యుపాసకుఁడు జగద్గురు నెదురుపడి, అయ్యా, మా మతమునకు మహా గణపతి హారిద్రాగణపతి యుచ్ఛిష్ట గణపతి నవనీతగణపతి సువర్ణ గణపతి సంతాన గణపతియని యారు విధముల నధిదేవతలు బ్రఖ్యాతులైయున్నారు. మొదటివారు నిరువురును మాయబన్ని శిష్యులం జేసికొంటివి. నేనుచ్చిష్టగణపత్యుపాసకుఁడ. నా మతమునిరాకరింప నీకకాదు నిన్ను సృష్టించిన విరించికైన శక్యముకాదు, వినుము.

శ్లో. చతుర్భుజంత్రినయనం పాశాంకుశగదాభయం
    తుండాగ్రతీవ్రమధుకం గణనాధమహంభజె
    మహాపీఠనిషణ్ణంతం వామాంగో పరిసంస్థితాం
    దేవీమాలింగ్యచుంబంతం స్పృశంస్తుండేనవైభగం

ఇట్టి స్వరూపముగల గణపతిని మేమారాధింతుము. జీవేశ్వరుల కైక్యము గలిగి నట్లాగణపతికిని దేవికిని నైక్యము గలిగియున్నది. ఫాలంబునంగుంకుమదాల్చుట మా మతాచారమై యున్నది. ఇచ్ఛాధీనములగు కర్మలంజేసిన మాకు దోషములేదు. మా మతంబున స్త్రీ పురుష జాతులు రెండేకాని యితర జాతిభేదములు లేవు. స్త్రీ పురుష సంయోగమువలన దోషనిరూపణము మా మతంబున యేమియుఁ జేయలేదు. ప్రతి వనితయు నిష్టమగు పురుషునితో భోగింపవచ్చును. దీనికి వీఁడేపతి యని దైవమని నిరూపించెనా యేమి? స్త్రీ పురుష సంయోగమువలనఁ కలిగిన యానందమే ముక్తియని మా మతసిద్ధాంతము. తదానందస్వరూపుఁడే గణేశుఁడు. బ్రహ్మాదులు తడంశసంజాతులు శ్రు॥ సకర్మణానప్రజయా అను శ్రుతి కర్మమువలనఁ బ్రయోజనము లేదని చెప్పుచున్నదికదా ! దానంజేసి మా కేమియు కర్మము లేదు. పుణ్యపాపములఁ దుల్యముగాఁజూతుము. ఇంత సుఖమైన మతము మరియొకటిలేదు. సుఖమిచ్ఛయించినవారెల్ల నీమతమే కైకొనవలయు నిదియే ముక్తిప్రదమని పలికిన విని యాచార్యుం డిట్లనియె.

ఓరీ మూర్ఖ ! నీ మతము ముక్తిప్రదమని నీవేకొనియాడుకొనవలయును.