పుట:కాశీమజిలీకథలు-05.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

కాశీమజిలీకథలు - ఐదవభాగము

భీషాస్మాదగ్ని శ్చేంద్రశ్చః పరమాత్మకు జడిసి వాయువు వీచుచున్నది సూర్యుడు బ్రతిదినముదయింపుచున్నాడు. అగ్ని యింద్రుఁడు లోనగు వారాజ్ఞావర్తులగుచున్నారని శ్రుతులు చెప్పుచుండగా సూర్యుఁడు పరమాత్మ యెట్లగును. మరియును,

శ్రు. నయత్రసూర్యోభాతినచంద్రతారకం
     నేమావిద్యుతో భాంతికుతోయ మగ్నిః
     తమేనభాంతమును భాతిసర్వం
     యస్యభాసాసర్వమిదం విభాతి.

ఏ పరమేశుని కాంతి పరిపూర్ణమై వెల్లుచుండ సర్వము ప్రకాశింపుచుండునో యట్టిపరమాత్ము ననుసరించి యంతయుం బ్రకాశింపుచుండును. అతని ప్రకాశములేనిదే సూర్యుఁడును జంద్రుఁడును దారలు మెఱపులు నగ్నియుఁ గూడఁ బ్రకాశింపరు. అని శ్రుతులు వక్కాణింపుచుండ సూర్యుఁడే పరమాత్మ యని చెప్పుటకన్న యవివేక మున్నదియా? జ్యోతిశ్శాస్త్రంబున సూర్యుని నిర్యత జెప్పబడియున్నది. ఇట్టి రవికి జగత్కారణత్వముఁజెప్పెడి మీవిద్యామహిమ గొనియాడఁదగినదే మూడబుద్ధిని విడిచి దానముక్తులయ్యెదరని యుపదేశించి వారినెల్ల శిష్యులుఁగా జేసికొనియెను.

జగద్గురుండట్లు చతుర్ముఖ వహ్నిసౌరమతస్థులఁ ద్రిసహస్రసంఖ్యాకుల నద్వైత మతావలంబకులం గావించి వారిలోఁ గొందరు శంఖములు బూజింపుచుఁ గొందరు ఘంటానాదంబులం గావింపుచుఁ గొందరు దాళంబులు వాయింపుచుఁ గొందరు వింజామరలు వీచుచుఁ గొందరు ఛత్రంబులంబట్టుచు సేవింపనన్యస్తసుఖ దుఃఖుండై యటఁ గదిలి వాయవ్య దిగ్దేశమునకరిగి యందందు సంచరింపుచుఁ జనిచని గణపత్యాశ్రమంబు గణపరంబను పురంబుఁజేరి యందు గౌముదీ నదియందు గృతావ గాహుండై గణపతినారాధింపుచు శిష్యులతోఁగూడ నందొకమాసము వసించెను. పర విద్యాప్రభేదులు దిగ్గజములని బిరుదు వహించిన యమ్మహాత్ముని శిష్యులు పద్మపాద ప్రభృతు లొకనాఁడు సాయంకాలమున నయ్యాచార్యశిరోమణిం బీఠంబున కూర్చుండఁ బెట్టి ఢక్కా తాళ ప్రముఖ వాద్యవిశేషంబులఁ బూని యమ్మహాత్ముని స్తుతిజేయుచు నృత్యములు చేయుచు నిట్లుపాడిరి.

శ్లో. ప్రపూర్ణం బ్రహ్మాహంనిఖిలజనకం బుద్ధినిహితం
    చిదానందం సత్యంసకలజగదాధారమమలం
    అగమ్యంవాగాద్యైస్సుజితకరణైర్జాతమనమై
    స్సునిర్వాణం లబ్ద్వాయదిహనపునస్సంసృతిరయః.

అట్లు పెద్దతడవు గురుభజనచేసి శిష్యులెల్ల నరసి పరమానందమంతో గురుసమీపంబున వసించిరి.