పుట:కాశీమజిలీకథలు-05.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

167

అగ్నియేసర్వోత్తముఁడు. తదారాధనము బ్రాహ్మణులకు ముక్తిప్రదము. దీనినెట్లు పూర్వపక్షము చేయుదురని పలికిన నాచార్యుం డిట్లనియె.

అగ్ని దేవతలకు సముఁడనియుఁ జెప్పబడియున్నది. అదియునుంగాక అగ్ని పరిచారకుండై దేవతలకు హవిర్భాగములఁ దీసికొనిపోయి యిచ్చుచుండును. మఱియు వహ్ని కర్మదేవత. అగ్ని కారణ వాక్యంబులన్నియు భూతాగ్ని పరమునుగా నిరూపింపఁబడినవి. మీరు వహ్య్నధీనముగా గర్మలసేయుచుండుఁడు. శ్రద్ధమాత్ర మద్వైతజ్ఞానమందుంచవలయును. దానంగాని మోక్షములేదు. అని తత్ప్రవృత్తి యంతయు బోధించి శిష్యులగాఁ జేసికొనియె.

తరువాత రక్తచందనపుష్పాదులందాల్చి సూర్యోపాసకులు శంకరాచార్య నెదుటకువచ్చి నమస్కరింపుచు యతీంద్రా! మేము సౌరమతస్థులము. మామతవృత్తి నాకర్ణింపుడు. సూర్యుండు త్రిమూర్తి స్వరూపుండని వేదముఁజెప్పబడియున్నది. సృష్టిస్థితిలయములు కమ్మహాత్ముండేకారణుండు. అతండే ప్రత్యక్షదైవము. 'ఘృణి స్సూర్య ఆదిత్యః' అనుమంత్రము సంతతయు జపించుచుందుము. మామత మారు విధములుగా నొప్పుచున్నది. కొందఱు బ్రహ్మస్వరూపుండగు దనుయభాస్కరు నారాధింతురు. కొందఱు శివస్వరూపుండగు నాకాశమధ్యస్థభాస్కరుని సేవింతురు. మఱి కొందఱు విష్ణుస్వరూపుండగు నస్తమయభాస్కరుం గొల్చుచుందురు. కొందఱు కాలత్రయమందును ద్రిమూర్త్యాత్మకమగు రవిబింబమును సేవించుచుందురు కొందఱు మండలేక్షణ వ్రతధారులై కాంచనశ్మశ్రుకేశాదియుక్తుండగు తన్మండల మధ్యస్థితు జూచుచు భవింపుదురు. వారు రవిబింబముజూచి కాని భుజింపరు. కొందఱు తప్త లోహంబున లలాట భునజవక్షస్థలంబున మండలచిహ్నంబుల వెలయించుకొని యుపాసింతురు. షడ్విధసౌర మతస్థులును మూలమంత్రమునే జపించుచుందురు.

మఱియు దన్మండలమధ్యవర్తియగు పురుషుండు పరమాత్మయని యనేక శ్రుతులు ఘోషింపుచున్నవి. పురుషసూక్తంబున భానుఁడే ప్రధానుఁడని నిరూపింపఁ బడియున్నది. గీతలలోఁగూడ అదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్॥ అని శ్రీకృష్ణభగవానుఁ డానతిచ్చియున్నాఁడు. బ్రహ్మాదిదేవతలు సూర్యునివలనం గలుగు చున్నారు. కావున ముముక్షువులు సూర్యునారాధించిన ముక్తినొందెదరిదియే మామత మని యెరింగించిన శంకరాచార్యులు మందహాసముగావింపుచు నిట్లనిరి.

ఓ భాస్కరభక్తులారా! మీరు నుడివిన ప్రమాణములే మీమతమును బూర్వ పక్షముసు సేయుచున్నవి వినుండు. చంద్రమామనసోజాతః చక్షోస్సూర్యో అజాయత అని పురుషసూక్తములో నున్నది. సూర్యుడు పరమపురుషుని చక్షుస్సులవలన జనించెనుగదా యేదిపుట్టుచున్నదో యది తప్పక లయమగునని తర్కశాస్త్రసిద్ధాంతము. అట్లనిత్యవస్తువులకు బ్రహ్మత్వ మెట్లు చెప్పెదరు? శ్రుతులు సూర్యనిష్ఠపర బ్రహ్మను స్తుతియింపుచున్నని. అదియునుగాక శ్రు॥ భీషాస్మాద్వాతః పవతె భీషోదేతిసూర్యః