పుట:కాశీమజిలీకథలు-05.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అట్లు సుబ్రహ్మణ్యక్షేత్రంబున కరిగి యందుఁ గుమారధార యను నదిం గ్రుంకువెట్టి శేషస్వరూపుండగు షణ్ముఖు నారాధింపుచు శ్రీ శంకరాచార్యు లైదు దినము లట వసియించిరి.

ఒకనాఁడమ్మహాత్ముండు దండకమండలు మండితుండై కాషాయాంబరముతో భూతిభూషిత సర్వాంగుండై రెండవ మేరుకోదుడు నింభాతివిరాజిల్లుచు సుబ్రహ్మణ్యస్వామి యాలయంబున గూర్చుండియున్న సమయంబున నాప్రాంతదేశముల నుండి కొందరు బ్రాహ్మణులరుదెంచి తత్తేజంబునకు వెరుగుపడుచు నెదుర నిలువంబడి నమస్కరింపుచు నిట్లనిరి.

స్వామీ ! మీరు సర్వమతంబులను ఖండింపుచు నద్వైతమత మొక్కటియే శ్రేష్ఠమని చెప్పుచున్నారఁట. మీతో వాదించి మా మత ప్రాబల్యము నిలుపుట కై యరుదెంచితిమి. మేము చతుర్ముఖమతస్థులము. మను ప్రభృతులచే గదితమగురుకర్మను జేయుచుందుము. సంతతము చతుర్ముఖునర్చింపు చుందుము.

శ్రుతి॥ హిరణ్యగర్భశ్శమవర్తతా గ్రేభూతస్యజాతః పతిరేకఆసీర్ ।
         సదాధారపృధివీంద్యాము తెమాంక స్మైదేవాయహవిషావిధేమ.

అని శ్రుతిచే బ్రహ్మయేనికర్తయనియుఁ బాలకుండనియు హంతయనియు సర్వాధికుఁడనియు నానంద స్వరూపుండనియుఁ దెల్లమగుచున్నది గదా ? అబ్రహ్మ లోకముల సృజించి యందాత్మస్వరూపంబునఁ బ్రవేశించి [తదైక్షత] అను శ్రుతులచే గొనియాడఁబడుచు శివవిష్ణువుల భుజములుగాఁ జేసికొని ప్రకాశింపుచుండును. మే మమ్మహాత్ముని భక్తులము. జ్ఞాననిష్ఠులము. కృతార్థులమై ముక్తినొందుచుందుము. ముక్తికిట్టిమతము ఘంటాపథమైయొప్పుచుండ నద్వైతమతంబుతో నేమి ప్రయోజన మున్నదని పలికిన నవ్వుచు శంకరాచార్యుం డిట్లనియె.

బ్రాహ్మణులారా! బ్రహ్మాదిభూతము లెవ్వానివలన జనించుచుండునో యప్పరమాత్మయొక్కఁడే నిత్యుఁడు. అతనిం దెలిసికొనవలయు. నందుల కద్వైత బోధయే హేతువు గావున వేదాంతవాక్యములు సదా వినుచుండవలయును. చతుర్ముఖ చిహ్నధారణము నింద్యము దానముక్తి లభింపదని యుక్తియుక్తముగాఁ జెప్పి వారి నొప్పించి శిష్యులగాఁ జేసికొనియెను.

పదంపడి వహ్నిమతస్థులు కొందఱరుదెంచి, స్వామీ! మేము వహ్ని సేవకులము. అగ్నిర్దెవోద్విజాతీనాం అను శ్రుతివలన బ్రాహ్మణులకగ్నియే దేవుఁడు మరియు శ్రు॥ అగ్నిరగ్రేప్రథమా దేవతాదేవతానాం అను ప్రమాణమువలన దేవతలకు సైతమగ్నియే ముఖ్యుఁడని స్పష్టమగుచున్నది. అదియునుంగాక శ్రుతి|| ఉద్దీప్యస్వజాత వెదోపఘ్నంనికృతింమమ.॥ అనుశ్రుతిచే విప్రులెల్ల నగ్నినారాధింపవలయునను విధి విధింపబడుచున్నది స్ఫులింగాత్ముని శకల ధారణమునఁ బవిత్రులగుచుందురు.