పుట:కాశీమజిలీకథలు-05.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

165

విడిచి పాషండధర్మములను నూని "బ్రహ్మాస్మి" యని ధ్యానించుకొనుము. దాన మోక్షము నొందగలవు అని చెప్పి యతని నద్వైతమతావలంబనునిగాఁ జేసెను.

పదంపడి కర్మహీనమతవాదియగు నామతీర్ధుండను వైష్ణవుండెదురు నిలువంబడి, యతిశేఖరా ! నీ చాతుర్యంబు గొనియాడఁదగినదియే! త్రుటిలో వీరినెల్ల విధేయుల జేసికొంటివి. ఇంటియొద్ద బెద్దపెద్ద మాటలంజెప్పి వీరిట్లొప్పుకొనుట చిత్రముగా నున్నది. కానిమ్ము మా మకమతం బదిగాదు. శేషుండైన దీనిం గదలుపఁ జాలడు వినుండు

శ్రుతి॥ సర్వం విష్టమయం జగత్॥ అను వాక్యంబు మా గురుండు శిష్యునికి బోధించుచు "స్వామీ! నా శిష్యుండు నీ పాదారవిందంబుల నమ్మియున్న వాఁడు. ఏ కర్మయు నెరుంగఁడు. వానికి భవదీయ సాయుజ్య మొసంగుము" అని కోరుచుండును. భగవంతుడట్లు ప్రార్థింతుడై మా మతస్థులనెల్ల ముకులం జేయు చుండును. మాకే కర్మయును లేదు. దానంజేసి పునర్జన్మ కలుగదు. కర్మవలనఁగదా జన్మము గలుగుచున్నది. జీవన్ముక్తులమై మేము వర్తింపుచుందుము. ఇదియే మా మత సిద్ధాంతము. సన్యాసి వైన నీవు సైతము మా మత మంగీకరింపవలయును.

శంకరు - బాలికా ! నీవు సత్యము పల్కితివి. కర్మబ్రష్టుండవైన నీవు జీవన్ముక్తుండవే సందియములేదు. నింద్యానింద్యవిహీనుండవై పిశాచంబులాగున వర్తించుచున్నాఁడవు. వేదోక్తకర్మలం జేయుచు దత్ఫలమీశ్వరార్పణముఁ గావించుట జ్ఞానులమార్గము. ఫలముగోరి కర్మలంసేయుట కర్మ మార్గంబు. ఈ రెండుమార్గముల విడిచియిపుడు నీవు రాజదండనకుఁ బాత్రుండవైతివి వినుము.

శ్లో॥ నచలతి నిజవర్ణ ధర్మతో య
     స్పమమతి రాత్కసుహృద్విపక్షపక్షే
     నజహతిన చహంతికంచిదుచ్చై
     స్సితమననం తమ వైహివిష్ణుభక్తం.

నిజవర్ణధర్మముల విడువక శత్రుమిత్రపక్షముల సమముగా జూచుచు దేని ఫలమును గోరక నిర్మలమైన బుద్ధికలవాఁడు వైష్ణవోత్తముఁడని చెప్పఁబడుచున్నాడు శ్రుతిస్మృతులు భగవంతునియొక్క యాజ్ఞలు. అట్టి యాజ్ఞల ద్రోహముఁజేసినవాఁడు నా భక్తుండైనను నరకమును బొందునని విష్ణుండే చెప్పియున్నవాఁడు. కావున వేదోక్తకర్మవిడువఁగూడదు. బ్రాహ్మణులకు నగ్నియే దేవుఁడు. బ్రహ్మచర్యాదులకు సైత మగ్ని సేవ విధియై యున్నయది. అట్టి కర్మను మీరు విడిచిరి కావున మీకు పతితులైతిరని పలికిన విని నామతీర్థుండు రక్షింపుమని యయ్యతిపాదంబులబడి వేఁడికొనెను. అట్లు వైష్ణవులనెల్ల శిష్యులంజేసికొని శ్రీ శంకరాచార్యు అచటనుండి బయలువెడలి కతిపయ ప్రయాణంబుల సుబ్రహ్మణ్యంబను పేరుగల కుమారస్థానమునకు కరిగిరి.