పుట:కాశీమజిలీకథలు-05.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మును సంపాదించుకొనుము. ముక్తుండ వయ్యెదవని యుపదేశించినంత మాధావాచార్యులు సంతోషింపుచు స్వకులగ్రామదేశస్థులతోఁగూడ నమ్మహాత్ముని పాదంబులఁబడి యనిగ్రహపాత్రుం డయ్యెను.

తరువాత వైఖానసమతాచారుండు వ్యాసదాసుండను వైష్ణవుండు ముందరికి వచ్చి యతీంద్రా ! బ్రహ్మదేవుండైనను మా మతము నిరాకరింపలేఁడు. నీవు వేదసమ్మతము వేదసమ్మతమని పలుమారు భాషింపుచున్నావు. మా మతము వేదసమ్మతమని మీకే తెలియఁగలదు వినుము.

శ్రుతి॥ తద్విష్ణొః పరమంపదం అను శ్రుతివలన విష్ణుపదము సర్వోత్కృష్టమని స్పష్టమగుచున్నది గదా ! మరియు ॥శ్రు ॥ నారాయణాద్బ్రహ్మాజాయతే రుద్ర ఏవచ అనుటవలన నారాయణునివలన బ్రహ్మయు రుద్రుండు జనించినట్లు తేలు చున్నది. ఈ రెండును శ్రుతులని నీ వొప్పుకొనకతీరదు. వీనివలన నతండు బ్రహ్మ రుద్రాదులకన్న నధికుండని తేలుచున్నది మేము తత్సేవకులము మావైఖానసమతము శ్రుతి సమ్మతమని దీనఁ దెల్లమగుచుండలేదా ? శంఖచక్ర పవిత్రాంగుఁడు నూర్ధ్వపుండ్రవిరాజమానుండు పూజ్యుఁడని మా మత సిద్ధాంతము అనుటయు.

శంక - వ్యాసదాసా ! మీకుఁ బాలకుఁడు విష్ణుఁడుగాని బహ్మగాని యగుం గాక. దానికి వివాదములేదు. నీవు విష్ణుభక్తుండవైతివేనిఁ దత్ప్రీతి కొఱకు గర్మలం జేయుము. అంతియకాని తత్సమముగాఁ దప్తచక్రాదుల ధరింపవలదు. అది యొక్కటియే వేదవిరుద్ధమైన పని.

వ్యాసదాసు — స్వామీ ! దీనికిఁ బ్రమాణము లేకపోలేదు. పూర్వ యుగంబున దత్తా త్రేయమహర్షి పంచముద్రలందాల్చి యున్నట్లు పురాణములలోఁ జెప్పఁబడి యున్నది. ముముక్షువులమగు మేము తన్మార్గమే కైకొంటిమి. చక్రాదిధారణము చేసి కొనక వైష్ణవత్వమునకే హాని రాఁగలదు. చిహ్నధారణ మవశ్యము చేసికొనఁదగినది.

శంక - చాలుచాలు. నీ వివేక మేమనఁదగినది ? ముద్రలవలన బ్రయోజనము లేదని బాలురకు సైతము దెలియఁగలదు. తత్త్వదర్శియగు దత్తాత్రేయ మహాయోగికి ముద్రలవలన నేమి ప్రయోజన మున్న. అతండు ముద్రలం దాల్చినట్లే పురాణములోను జూడలేదు. మూడబుద్ధిని విడిచి సుఖింపుము.

శ్లో. ప్రహ్లాదస్య విభీషణస్య గజరాజస్య ద్రువస్యానిలే
    ద్రౌపద్యాప్రజవాసినాంచఖలుకశ్చక్రాంకసంరేకరోత్
    తస్మాన్మూఢమతిం విహాయసకలం పాషండచిహ్నం త్యజ
    బ్రహ్మాస్మీతినిభావనేనసుసుఖం గచ్ఛాశుమోక్షం పదం.

వైధేయా ! ప్రహ్లాదనారదాదిభక్తులకు జక్రాంకన మెవ్వరు గావించిరి. వారు చిహ్నితులైనట్లు లేపురాణ లందైన వ్రాయబడియున్నదా ? మూఢబుద్ధిని