పుట:కాశీమజిలీకథలు-05.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

కాశీమజిలీకథలు - ఐదవభాగము

లచేఁజహ్నితులమై సంసారంబుబాసి వైకుంఠపదంబు నొందుచుందుము. చక్రాంకితమునకు శాస్త్రదృష్టాంతములు లేవని చెప్పరి.

శ్లో॥ యేబాహుమూలపరిచిహ్నితశంఖచక్రా
     యేకంఠలగ్నతులసీనళినాక్షమాలాః
     యేవా లలాటఫలకేలసదూర్ధ్వపుండ్రా
     ప్తేవైష్ణవాభువనమాశు పవిత్రయంతి ॥

ఈ శ్లోకము ప్రమాణముగాదా ? ఇట్టి వైష్ణవులు లోకమును బవిత్రమును జేయుదురని చెప్పంబడి యుండలేదా ! దీనికేమి చెప్పెదరు.

శంక — [నవ్వుచు] ఓహో ! వైష్ణవోత్తమా ! నీవు చదివిన శ్లోకము శ్రుతి సమ్మతమైనదికాదు. శ్రుతివ్యతిరిక్తమైన దానిని మేము ప్రమాణముగా స్వీకరింపము. అతప్తతనుండుముక్తిఁ జెందఁదను శ్రుతి ననుసరించి యీ శ్లోకము రచింపఁబడెనంటి వినుము. ఆ శ్రుతి కది యర్ధముగాదు. తప్తతనుఁడన లోహచక్రాదులచేఁ గాల్చుకొనుట గాదు. కృఛ్రచాంద్రాయణాది నియమవిశేషములచే శరీరమును దపింపఁచేసిన మోక్షము గలుగునని శ్రుతి యభిప్రాయము. అయ్యో! అట్టి యభిప్రాయమును గ్రహించక యూరక శరీరమును గాల్చికొనుచున్నారే.

శ్లో॥ బ్రహ్మజ్ఞోయస్సోశ్ను తేమోక్షమిత్యా
     దేర్వాక్యాన్మోక్షస్య హేతుర్విబోధః
     క్షీణేపుణ్యేమర్త్యలోకంవిశంతీ
     త్యాదేర్వాక్యాదన్యతస్సంసృతిస్స్యాత్॥

బ్రహ్మజ్ఞుండే మోక్షమును బొందుచున్నాడు. మోక్షమునకు బోధయే కారణము. పుణ్యముక్షీణింపఁగాఁ దిరిగి మర్త్యలోకమును బొందును స్వర్గాదికము ముక్తికాదు. దానివలన సంసారము విడువదు. అని శ్రుతులు ఘోషింపుచున్నవి. స్వాభిమానమును విడచి ధర్మసూక్ష్మములజక్కగా గ్రహింపుఁడు. ఆత్మ యొక్కటియే నిత్యమైనది. అదియే జగత్కారణము. పరమాత్మకు నామరూపాదులు లేవనుచుండ శంఖచక్రాది ధారణము పూర్వపక్షము గాదా ? రూపశూన్యుని ధ్యానించుట కష్టమని మందబుద్ధుల కొఱకు భగవంతునికి నామరూపాలంకారాదులు గల్పింపఁబడినవి. బ్రహ్మాహమస్మియని సర్వదాధ్యానింపుఁడు. భేద బుద్ధివిడువుఁడు జీవుఁడే యీశ్వరుండని తోచును దానంజేసి సంసారమునశించును. బ్రాహ్మణునికి శిఖాయజ్ఞోపవీతంబులు దాల్చుట వేదవిహితమై యున్నది. చిహ్నధారణము నిషేధమని బృహన్నారదీయాది మహాగ్రంథముల యందు వ్రాయఁబడియున్నది. తద్ధారణంబున హరిసమానుల మగుదుమనుకొనుట మనోరాజ్యమువంటిదేసుఁడీ. అని యెన్నియో దృష్టాంతరములఁజూపి యాత్మబోధఁజేసి యతని శిష్యునిగా జేసికొనెను.