పుట:కాశీమజిలీకథలు-05.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

కాశీమజిలీకథలు - ఐదవభాగము

లింగ -- స్వామీ! త్రిపురాసుర సంహారకాలంబున రుద్రుండు శూలాచ్యా యుధముల ధరించినట్లు పురాణములలోనున్నది కదా! సేవ్య సేవక న్యాయంబున మేము సేవకులము గావునఁ దదాయుధములఁ జిహ్నములఁగా ధరింతుము. దీనందప్పేమి !

శం - తప్పని యెన్నిసారులు చెప్పవలయును. రాజు ఛత్రచామరములు దాల్చెనని సేవకుఁడు తచ్చిహ్నంబులఁ దాల్చిన నెట్లుండునో యూహింపుఁడు దాని నించుకయుఁ బ్రయోజనములేదు. లేదు. పాదిత్యముగూడ రాఁగలదు. ముక్తిజ్ఞానము కన్న వేరొక సాధనము లేదు. పామరబుద్ధి విడువుఁడు. అద్వైతజ్ఞానమార్గ మవలంబింపుఁడు అని తత్ప్రకారంబంతయు నుపదేశించి వారినెల్ల శిష్యులం జేసికొనియెను.

శంకరయతి పుండరీకుండట్లు రామేశ్వరములో రెండుమాసములుండి పాశుపతాద్యద్వైతమత విరోధులనెల్ల వశపరచుకొని యచ్చటనుండి బయలు వెడలి సపరివారముగా ననంతశయనమున కరిగెను.

వైష్ణవమత ఖండనము

అందు ననంతపద్మనాభస్వామి నారాధింపుచు నెలదినములు వసియించెను. మరియు నందుఁగల వైష్ణవమతస్థులెల్ల నొక నాడయ్యతి తల్లజునితో వాదింప నరుదెంచుటయు సంవాదము జరిగినది.

శంక — మీరెవ్వరు మీ మతప్రవృత్తి యెట్టిదో వక్కాణింపుఁడు.

విష్ణుశర్మ - అయ్యో ! వినుండు భక్తులు, భాగవతులు, వైష్ణవులు, పాంచరాత్రులు. వైఖానసులు, కర్మహీనులు. అని వైష్ణవు లారువిధంబుల చెప్పుచుందురు. అందు మేము భక్తులము, జ్ఞానక్రియా విభేదముల మా యాచారము రెండువిధముల నొప్పుచున్నది. వాసుదేవుం డనేకావతారలెత్తి భక్తజనసులభుండై యున్న వాఁడు తదుపాసనచే మూఢులుసైతము తత్సాయుజ్యము నొందుదురు. అనంత పదకమలధ్యానమే మాకురక్షకము. అవి యేమియుఁ జేయక ధ్యానించుటయే జ్ఞానము. తదాజ్ఞలేక తృణమైనఁగదలదు. తదుపాసనమే క్రియ. ఇదియే మా మతము.

శంక — క్రియ యనఁగాఁ దదుపాసనయని చెప్పుట మూర్ఖత.

శ్లో. జన్మవాజాయతేసూద్రః
    కర్మణాజాయతేద్విజః
    నిత్యంసంధ్యాముపాసీత
    ప్రత్యవాయోన్యధాభవేత్॥

బ్రాహ్మణుండు జన్మచే శూద్రుండై కర్మచే ద్విజుండగుచున్నాఁడు. విప్రుండు నిత్యము సంధ్య నుపాసించఁదగినది. అట్లు చేయనిచో ప్రత్యవాయము