పుట:కాశీమజిలీకథలు-05.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

కాశీమజిలీకథలు - ఐదవభాగము

వేదవేదాంగపారగుఁడగు బ్రాహ్మణుశరీరమున సమస్తదేవతలు వసింతురని శ్రుతులు చెప్పుచున్నవి. అట్టివిప్రశరీరము చిహ్నములచేఁ గాల్పఁబడెనేని యందున్న దేవతలు పారిపోవుచున్నారు. కావున వ్యాధిలేక విప్రశరీరముఁ గాల్చరాదు. కర్మయోగ్యమగు బ్రాహ్మణ శరీరమున వాతలుజూడఁబడెనేనిఁ బ్రాయశ్చిత్తముఁ జేసికొన వలయును. కావున మీమతము శ్రుతిసమ్మతముగాదు.

శైవు - అయ్యా ! తమవాక్యంబులు వినుటచే నీశ్వరారాధనము పుణ్యప్రదముగాదని తేలుచున్నది శివునిఁబూజింపవలయునని చెప్పెడి గ్రంధములన్నియును బూటకములేనా.

శంక - మీకు ధర్మరహస్యములు తెలియవు. భక్తిజ్ఞానవైరాగ్యములు బ్రాహ్మణునికిఁ గలిగియుండవలెను. కేవలము భక్తియొక్కటియే బ్రాహ్మణేతరులఁ దరింపజేయును. అదిశుద్దకైవల్యమీఁజాలదు. శివవిష్ణ్వాది శబవాచ్యత్వము నిర్గుణునికిఁ గల్పితము. సగుణోపాసనమున నజ్ఞానముబోదు. అజ్ఞానముపోవుటయే ముక్తి. వహ్ని లేకపాకము సిద్ధించనట్లు త త్త్వజ్ఞానంబులేక మోక్షముదొరకదు. బ్రహ్మాది స్వరూపములచే నొక్కడే సృష్టిస్థితివినాశనములం జేయుచున్నాఁడుకాని వానికిన్ని రూపములు లేవు. భేదయుక్తమగు నుపాసన నిద్వమని శ్రుతిచెప్పుచున్నది. లోకమంతయుఁ గర్మబద్ధమైయున్నది. జ్ఞానము సిద్ధించువఱకుఁ గర్మనువిడువరాదు. పురుషుఁడు బ్రహ్మబోధకొఱకు బ్రహ్మజ్ఞు నాశ్రయింప వలయును.

గురుకారుణ్యమున నద్వైతబోధగలిగి ముక్తుండగు. అద్వైత జ్ఞానంబే పునరావృత్తిరహితమగు ముక్తినిచ్చు నిదియే నమ్ముఁడు చిహ్నధారణముమానుఁడు. అని తత్త్వోపదేశమునుజేసి వారినెల్లర స్వమతాయత్తులంజేసికొనియెను.

అప్పుడు వారిలో లింగధారు లీర్ష్యాకషాయిత హృదయులై వారిని నిందించుచు శంకరున కభిముఖముగా నిలువంబడి యిట్లు వాదించిరి.

లింగ — యతీంద్రా! మాయావేషమును గైకొని ప్రామాణిక మతమునుండి మాశైవులనెల్లర భ్రష్టులం జేసితివిగదా ?

శ్లో॥ బ్రాహ్మణ్యాదుత్తమం ప్రోక్తంవైష్ణవంమునిసత్తమ
     వైష్ణవాదధికం శైవమిత్యజః ప్రాహనారదం

బ్రాహ్మణ్యముకంటె వైష్ణవమతము వైష్ణవమతముకంటె శైవమతము గొప్పదని నారదునితో బ్రహ్మచెప్పియున్నాఁడు.

శ్లో॥ సర్వాననశిరో గ్రీవస్సర్వభూతమహాశయః
     సర్వవ్యాపీసభవాస్‌తస్మాత్సర్వగతశ్శివః॥

అని శాస్త్రములు ఘోషింపుచుండు. శివమతము నిరాకరింప నీ తరమా !