పుట:కాశీమజిలీకథలు-05.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నాశనమొందుదానికి నిత్యతకలుగదు. చతుర్ముఖునికే నాశనముగలుగుచుండఁ దన్ముఖంబునం బొడమిన శారదనిత్యయెట్లగును? పరమాత్మవ్యతిరిక్తమగు పదార్దమెద్దియును నిత్యముగాదు. లక్ష్మియు భవానియు సరస్వతియుగూడఁ బ్రధానదేవతలుగారు. మోక్షేచ్ఛతో వారి నారాధించిన లాభములేదు ముక్తికి నద్వైతజ్ఞానము కావలయును. ముముక్షువు లాత్మనాత్మచే ధ్యానింపు చుండవలయు కుంకుమాద్యంకథారణము శాస్త్ర దూష్యము. ఫలాపేక్షతో వారి నారాధించిన నారాధింపవచ్చును. జ్ఞానులకు బ్రహ్మతో నైక్యము చెప్పఁబడియున్నది. బ్రహజ్ఞుఁడే బ్రహ్మ యగును గావున మీరందరు భేద బుద్ధినివిడిచి యద్వైతమత మవలంబింపుఁడు. ముక్తులయ్యెదరని యద్వైతజ్ఞానంబంతయు నుపదేశించుటయుఁ దెలిసికొని పరమానంద కందళితహ్మదయారవిందులై వారెల్ల శిష్యులై తత్పదపల్లవంబుల నాశ్రయించిరి వారిలో వామాచార మతస్థులు సమ్మతింపక యెదుర నిలువంబడి యిట్లు వాదించిరి.

వామ — సన్యాసీ ! నీ ప్రజ్ఞమిగులఁ గొనియాడఁదగి యున్నది గదా ? ఏవియో నాలుగు మాయమంత్రములను జెప్పి వీరినెల్ల శిష్యులఁగా జేసికొంటివి. చాలు చాలు వంథ్యాపుత్త్రసమంబగు నద్వైత జ్ఞానంబున వేషధారివై తిరుగుచు లోకుల మోసముఁ జేయుచున్నావు గదా. సంవిత్స్వరూపమేదియో నీవెరుంగుదువా? ఏశక్తిలేక పరమేశ్వరుండు తృణమునైనఁ గదల్పఁజాలఁడో యట్టియాదిశ క్తియే స్వతంత్రురాలు. సకలవిద్యాస్వరూపిణి, జగత్కారణమైయున్నది. అట్టి శక్తి సేవకులమగు మాకుముక్తి గలుగదని నీవాడితివి. నీ యజ్ఞానమేమని చెప్పఁదగినది.

శ్లో॥ తప్యాస్సేవానిరతమనసాం నోనిషేధోధికారో
      నాస్త్యైవైవంహితకరణే సిద్ధతామాగతానాం
      నిస్త్యైగుణ్యేపధివిచరతాం కోవిధిః కోనిషేధో
      భృగ్వాదీనామమలమనసాం నఃప్రవృత్తిర్హి మానం.

శక్తిసేవా పరతంత్రులకేదియు నిషేధములేదు. తపస్సిద్ధులగు వారికి విహిత కార్యములనాచరించుపని లేదు. త్రిగుణాతీతమగు మార్గమందు సంచరించువారికి విధి నిషేధములు లేవు. అని చెప్పెడి భృగ్వాది మహర్షులయొక్క ప్రవృత్తియే మాకుఁ ప్రమాణమైయున్నది. మఱియు

శ్లో॥ మత్స్యోమాంసంచ మద్యంచముద్రామైధున మేవచ
     మకారపంచకం జ్ఞేయం వామాచార విశారదైః,

ఈమకార పంచకము మేము సేవింపవచ్చును. మాకిందేమియు విధినిషేధములులేవు. నీవుగూడ మాయాచారమును గైకొని సుఖింపుమని పలికిరి.

శంక — మూఢులారా ! భృగ్వాదిమహర్షులప్రవృత్తియే మాకు బ్రమాణ