పుట:కాశీమజిలీకథలు-05.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

155

శంక — మీ మత స్వభావముగూడ వాక్రువ్వుఁడు.

లక్ష్మీ - చిత్తము

శ్లో॥ మహాలక్ష్మీరాద్యా ప్రకృతిరసదిత్యాదినిగమై
     స్పదేవేతిశ్రుత్యాపరమపురుషశ్శ్యామలతనోః॥॥

శ్లో॥ లక్ష్మ్యాస్సమారాధనతత్పరాణాం
     పద్మాక్షమాలాభిరలంకృతానాం
     బాహ్యోశ్చకంజాంకవిభూషితానాం
     సుకుంకుమేనాంకితమస్తకానాం
     హస్తస్థితాము క్తిరతోభవద్భి
     రుపాసనీయ సకలేశ్వరేశ్వరీ.

స్వామీ ! మహాలక్ష్మీయాది ప్రకృతియని వేదములలో నున్నది గదా! పద్మాక్షమాలచే నలంకరింపంబడి కుంకుమమొగమున నలమికొనుచు బాహువుల పద్మాంకములు వెలయునట్టి మహాలక్ష్మిని సేవించిన లక్ష్మీభక్తులకు మోక్షమరచేతిలోనున్న యది. ఇదియే మా మత సిద్ధాంతము.

శంక — [నవ్వుచు] తరువాత వారెవ్వరో చెప్పవలయు.

సార — అయ్యా ? మేము సరస్వతీ సేవకులము వినుండు.

శ్లో॥ స్వామిన్వేదస్యనిత్యత్వా చ్ఛారదానిత్యరూపిణీ
     కారణం సర్వలోకానాం పరాత్పరతరామతా।
     జగత్కర్త్రీతినిత్యావాగితిచశ్రుతివాక్యతః
     సైవాత్మబ్రహ్మవిష్ణ్వాదిశబ్ద జాలైరుదాహృతా।
     గుణాతీతస్వరూపాచసీ వ్యాసర్వముముక్షుభిః॥

ఆర్యా! వేదము నిత్యమగుట తత్సరూపిణియగు శారదయు నిత్యయగు చున్నది. కృతులయందు సరస్వతియే బ్రహ్మవిష్ణాద్విశబ్దవాచ్యయని చెప్పఁబడి యున్నది. సరస్వతియే పరాత్పరురాలు. వాణియే జగత్కర్త్రి. శారదయే ప్రధానశక్తి. గుణాతీతస్వరూపిణియగు వాగ్దేవి నారాధింపుచుతచ్చిహ్నములందాల్చి మేము ముక్తుల మగుచున్నాము.

శంక - ఓహో? మీలో మీకిట్లు పరస్పరభేదములు గలిగియున్నవే! లోకమంతయు నిట్లేయున్నది. వినుండు తాల్వాదిసంగమున జనించిన వేదమునకు నిత్యత్వ మెట్లు సిద్ధించును. వేదముపరమ పురుషుని వ్వాసములని చెప్పబడియున్నది. ఏది పుట్టునో యదిలయమగునుగదా ఇదియునుంగాని యుగాంతరములయందు వేదము సాంగముగా సశించునని రవిమహర్షులతోఁ జెప్పినట్లు సూర్యసిద్ధాంతములోనున్నది.