పుట:కాశీమజిలీకథలు-05.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

కాశీమజిలీకథలు - ఐదవభాగము

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

52 వ మజిలీ

పంచమోల్లాసము

శ్రీశంకరయతి సార్వభౌముండు, పద్మపాద, హస్తామలక, సమిత్పాణి, చిద్విలాస, జ్ఞానకంద, విష్ణుగుప్త శుద్ధకీర్తి, భానుమరీచి, కృష్ణదర్శన, బుద్ధివృద్ధి, విరించిపాద, శుద్ధాంతానందగిరి ప్రముఖులు శిష్యులు వెనవేలు భజియింప, సుధన్వుం డనురాజు చతురంగబల పరివృతుండై తొడరా దిగ్విజయము సేయ శుభముహూర్తంబున బయలు వెడలి ప్రమధసహితుండగు భర్గుఁడువోలె నొప్పుచు నొకనాఁడు మధ్యార్జునం బను శివక్షేత్రంబున కరిగి యందుఁగల ద్వైతమతస్థుల నెల్ల గర్కశతర్కయుక్తి ప్రహరణములచేఁ బరాజితులం గావించుటయు వారిలో నొకవృద్ధుండు లేచి సామీ! నీవు సకలశాస్త్ర పారంగతుండవు నీతో మేము సమముగా వాదింపఁజాలము వాదియపండితుండైనంతనే మత ప్రాబల్యము దగ్గునా ? భేదము ప్రత్యక్షముగాఁ గనంబడు చుండ నభేదవాదము నెవ్వడంగీకరించును. ఇందుల కెద్దియేని దైవనిదర్శనముఁ జూపెద నేని నీ మాటల విశ్వసింతుమని పలికెను.

ఆ మాటలఁ బాటించి శంకరయతి శేఖరుండు వారినెల్ల మధ్యార్జునస్వామి యాలయంబునకుం దీసికొనిపోయి స్వామియెదుర నిలువంబడి చేతులు ముకుళించి జగదీశ్వరా! ద్వైతాద్వైతమతతార తమ్యంబు వివరింప నీవెసమర్ధుండవు అందలి నిక్కం బెరింగించి మా సందియము బోఁగొట్టుమని ప్రార్ధించుటయు నమ్మహాలింగాగ్రంబున నొక్క దివ్య పురుషుండావిర్భవించి "సత్యమద్వైతం సత్యమద్వైతం సత్యమద్వైతం" అని ముమ్మాఱుపలికి యంతర్ధానము నొందెను. అద్దివ్యవచనంబుల నాలించి ద్వైతు లందరు విస్మయమునొందుచు నద్వైతముసర్వోత్కృష్టమని యొప్పుకొని యమ్మహాత్ముని శిష్యులై వెనువెంట దిరుగఁజొచ్చిరి.

అందుండి యయ్యతిచంద్రుండు శిష్యసహితముగాఁ గతిపయ ప్రయాణంబుల రామేశ్వరమున కరిగి యందుఁ గలుషనిచయధూమకేతువగు సేతువున గ్రుంకి రామనాధు నర్చించి తక్కుంగల తీర్థంబుల నెల్ల సేవించి యందుఁగల యద్వైతమత విరోధుల నిరోధింప రెండు మాసములు నివసించెను.