పుట:కాశీమజిలీకథలు-05.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

151

అప్పుడావార్త యాదేశమంతయు వ్యాపించినది. కేరళదేశాధీశ్వరుఁడైన రాజశేఖరుండను నృపాలుండు సత్వరముగా నరుదెంచి నిజకిరీట కోటిఘటితమణిగణ కిరణనిచయములచే శంకరగురుని చరణ సరసిజములకు నీరాజన మిచ్చుటయు నమ్మహనుభావుండు గురుతువట్టి రాజా! నీకుభద్రమా! నీరచించిన నాటకములు వ్యాపకముగా నున్నవియా? యిట కేమిటికి వచ్చితివని యడిగిన నయ్యెడయఁ డు ఫాలంబునఁ గేలుగీలించి యల్లన నిట్లనియె

మహాత్మా! భవదీయకరుణావిశేషంబున నేకొరంతయలేదుగాని నాచే రచింపఁబడిన నాటకములుమూడును ప్రమాదవశంబునంజేసి దగ్ధములైనవి. మరల వానిరచించుట కట్టి బుద్ధిపాటవములేదు. తన్నాశనదుఃఖంబు నన్నూరకబాధింపుచున్నది. మీరల్లనాఁడు వాని వింటిరిగద. ప్రధమశిష్యునకుఁ బంచపాది ననుగ్రహించితిరని లోకమంతయుఁ జెప్పుకొనుచున్నది. కరణాళుండవై నన్నుఁగృతిచేఁ గృతకృత్యునిఁగాఁ జేయవేఁడుచున్నానని ప్రార్థించిన విని యయ్యతి చంద్రుఁడు మందహాసచంద్రికలు గండఫలకల వ్యాపింపఁ జేయుచు నామూడునాటకముల నామూలచూడముగా నేకరువు పెట్టెను

విస్మయసంతోషంబుల మనంబునం బెనంగొన వానిని వ్రాసికొని యారాజు మహాత్మా ! నీవవతార శరీరుఁడవు. నీప్రభావంబెన్న మాబోటులకు శక్యముకాదు. నీకు నేను కింకరుండఁ బనులకు నియోగింపుమని ప్రార్ధించిన నాగురుండు రాజా ! నీవు నాకుఁ గావింపవలసిన దేమియును లేదు కాలట్యగ్రహారవాసులగు బ్రాహ్మణులు ద్విజ కర్మలకుఁ దగరని శపించితిని. మచ్ఛాపంబు మన్నించి నీవును వారికట్లు విధింపుము. పాపమతులఁ గనికరింపరాదుగా యని యాజ్ఞాపించిన వల్లెయని యానృపతల్లజుండతని పాదపల్లవములకు నమస్కరింపుచుఁ దదనుజ్ఞవడసి నిజపురంబున కరిగె.