పుట:కాశీమజిలీకథలు-05.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నింటికిం జనియెను. నాటంగోలె నమ్మహాత్ముని పాదసేవ మాకులేదు. మేమును నీవలెనే తీర్థాటనము సేయుచున్న వారము. అమ్మహాత్ముండిప్పుడు కేరళ దేశమందు మహా సురేశ్వరుని యాలయంబుననున్నాడని యొకబ్రాహ్మణుఁడుచెప్పెను. అచ్చటికిబోవు చున్నారము. దైవికమున నీవిందుఁ గనంబడితివి. పోదము రమ్మనుటయుఁ బద్మ చరణుండు సంతసించుచు వారితో బయబదేరెను.

వారందరుంగలసి కతిపయప్రయాణంబుల మహాసురేశ్వరుని యాలయంబునకుంజనియందు దేవస్తుతిగావించు గురువరునింగాంచి ప్రహర్షపులకితశరీరులై సాష్టాంగ నమస్కారములు గావించిరి శిష్యుల నందఱ గ్రుచ్చియెత్తి కరుణాకటాక్షవీక్షణంబుల విలోకింపుచు వేరు వేర కుశలమడిగి సాదరంబుగ గారవించుటయ నప్పుడుపద్మపాదుం డతి దీనమనస్కుండగుచుఁ గంఠంబున గద్గదికదోప మెల్లననిట్లనియె మహాత్మా నేను దేవరయానతివడి రామేశ్వరమునకరుగుచుఁ బూర్వాశ్రమబంధుండుగు మేనమామ యింటికింబోయి యతనిచే నర్చితుండనై యతనియొద్ద నారచియుంచిన టీకంజదివితిని. అతండందుఁ గొన్ని శంకలం గావించెను. అప్పుడు విధ్వస్తతర్క గురుకాపిలతంత్రములగు భవదీయ సూక్తజాలములచే నతనిఁ ద్రుటిలో నిరుత్తరుం జేసితిని.

ఆ మత్సరంబుమదంబున నడంచుకొని యతండు యధాపూర్వముగా నన్నభినందించిన సంతసించును నేనా టీకయతనియొద్ద దాచి సేతుయాత్రకరిగి వచ్చితిని. ఆ లోపలనావంచకుండిటింతోఁ గూడ నా గ్రంధమును దగ్ధముగావించెను. అంతటితో విడువక నాకు గ్రంథరచనా పాటవము లేకుండ నన్నములోమ దిడి నాడెందమునకు మందత గలుగజేసెను. ప్రభాకర శిష్యుండుగు నతనియూహ తెలిసికొనలేక మోస పోయితిని. స్వామీ యేమిసేయుదును. మునుపటి యూహలేమియు స్ఫురించవు. కరుణాసముద్రుండవగు నీదాసునకిట్టి యవమానమేమిటికి రావలయు. భవదీయ పాదపద్మదర్శనమైనది నాచింతవాయఁగలదని పలికినవిని శంకరాచార్యులు కృపారసపూరితాంతరంగులై యమృత సమంబులగు పలుకుల నూరడింపుచు నిట్లనిరి

వత్సా ! పద్మపాద ! దైవమునుమీరిన వాఁడెవ్వఁడును లేఁడు. కర్మపరిపాకము కడువిషమమైనది. వినుమీతెరంగు మునుపే నేనెరుగుదును. సురేశ్వరునితోఁ గూడఁ జెప్పియుంటిని కానిమ్ము. పూర్వము శృంగగిరియందు నీవు నా చెంతఁ జదివిన పంచపాది నాకు జ్ఞాపకమున్నది. అదియంతయుం జదివెద వ్రాసుకొనుమని పలికిన విని యతండు మితిలేని కుతుకముతో నదియంతయు వ్రాసికొనియెను

ఆ కృతి యాకృతినంతయు యధాపూర్వకముగా వక్కాణించెను. సర్వ విద్యాబ్రవృత్తిగలిగి త్రిభువనగురుండగు పరమపురుషున కొక్కసారి వినిన గ్రంథము మరలఁ జదువుట యొకయబ్బురమా ? అట్లు పద్మపాదుండు పంచపాదిని వ్రాసికొని యబ్బి యానందంబు పట్టఁజాలక గంతులువైచుచు నానందాశ్రులుగార నడుచుం బాడుచుం బలుతెరంగుల సంతోషమున బ్రకటించుకొనియెను.