పుట:కాశీమజిలీకథలు-05.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

149

వచ్చుంగాక. దీని నిర్మూలించుటయే కర్తవ్యము. గృహముతోఁగూడ దీని దగ్ధము గావించెద. స్వపక్ష నాశనముకన్న గృహనాశనమే శ్రేయము. అట్లైనఁ పద్మపాదునకు నిందించుట కవకాశము గలుగదని దలంచి యొక రేయిఁ దనయింటికి నిప్పంటించుకొని నాయిల్లు దగ్ధమగుచున్నదో యని పెద్ద యెలుంగున నరచెను.

అప్పుడు గొప్పచప్పుడు లుప్పత్తిల్లగుప్పునఁ బొగగ్రమ్మియమ్మందిరము దగ్ధమగుచుండ గ్రామస్థులెల్ల సత్వరముగా నరుదెంచి తగుప్రయత్నముఁ జేసిరికాని యించుకయుం బ్రయోజనము లేకపోయినది. భస్మావిశేషమైన తనయింటింజూచి యా బ్రాహ్మణుండు గుండెలు బాదుకొనుచు, అయ్యో నాకీగృహము నాశనమైనదని యించుకయు విచారములేదు. పద్మపాదుండు నాకొకపుస్తక మిచ్చిపోయెను. అది యిందు దగ్ధమైనది దానిగురించి చింతించుచున్నవాఁడని పదుగురు విన శోకించుచు బంధుజన ప్రభోధితుఁడై యెట్టకేని యాదుఃఖము వాసికొనినట్లభినయించెను. పద్మపాదుండును సేతుయాత్రఁజేసికొని వెండియుం గొన్నిదినంబులకు మాతులగృహంబున కరుదెంచెను. అతండతనిఁ గౌగిలించుకొని యార్యా ! దైవమెట్లుగావించెనో చూచితివా ? నాకు నీ మొగముచూచుట సిగ్గగుచున్నది. నీవు ప్రాణపదముగా నాకప్పగించిన పుస్తకము దిరుగ నీచేతఁబెట్టుభాగ్యము నాకుఁబట్టినదికాదుగదా. గృహముపోయిన విచారముకన్న నీవిచారమే నన్నెక్కడగా బాధింపుచున్నది. ఏమిచేయుదును. సంతతము నిన్నే తలంచుకొనుచుఁ గృశింపుచుంటినని బుడిబుడిదుఃఖంబభినయించిన వారించుచు పద్మపాదుం డిట్లనియె.

మామా గతమునకు వగచుట సాధుధర్మముగాదు. పోనిమ్ము దైవికమునకు నీవేమిచేయుదువు పుస్తకముపోయినం బోవుఁకాక నా బుద్ధియెక్కడికిఁ బోయినది. కొన్ని దినములిందుండి వెండియు నాగ్రంథము రచించెదఁ జూడుమని పలికి యప్పుడే గంటము చేతింబూని గ్రంథరచన ప్రారంభించెను.

అప్పుడు మాతులుఁడు అయ్యో ! నాచేసిన ప్రయత్నమంతయు వ్యర్థమై పోయినది మఱల నితండా గ్రంథమును జేయుచున్నవాఁడు. దీనికంతరాయమెట్లుగలుగునని యాలోచించి యాలోచించి యతండు భుజించనప్పు డన్నములో బుద్ధిమాంద్యము గలుగఁజేయు నోషధీ విశేషము గలిపెను. దానిందిని యతండు మందబుద్ధియై మును బోలె గ్రంథరచనా పాటవంబులేక విచారింపుచుండె.

అట్టిసమయంబున శ్రీశంకరశిష్యులుకొందఱాకస్మికముగా నచ్చటికివచ్చుటయు వారింగాంచి పద్మపాదుండు ప్రహర్షసాగరంబున మునుంగుచు నాలింగనముఁ జేసికొని మిత్రులారా ! మీరెందుండి వచ్చుచుంటిరి మనగురుండెందున్న వాఁడు. విశేషములేమనియడిగిన వారిట్లనిరి.

ఆర్యా! నీవరిగిన కొన్నిదినంబులకు మన గురుండు తల్లికిఁ బ్రాణోత్క్రమణసమయ మగుచున్నదని యెరింగి మమ్మువిడిచి శృంగగిరినుండి యోగశక్తి