పుట:కాశీమజిలీకథలు-05.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

153


శాక్తమతఖండన

ఒకనాఁడు తులాభవానీమందిర నివాసులగు శాక్తమతస్థులెల్ల గుమిఁగూడి యిట్లు తమలో సంభాషించికొనిరి.

భవానీసేవకులు — లక్ష్మీభక్తులారా! మనయూరు శంకరుండను సన్యాసి మిగుల జంఝాటముతో నరుదెంచుట మనమతముల నిర్మూలించుటకఁట వింటిరా ?

లక్ష్మీ సేవకులు — వింటిమి. వింటిమి. ప్రొద్దుట నతని శిష్యుండొకండువచ్చి బీరములు పలికిపోయెను. అద్వైతమతమొక్కటే ముక్తికి హేతువట. తక్కిన మతము లన్నియు దబ్బరలఁట. ఆహా! యెంత విచిత్రముగా నున్నది.

భవానీ — ఇప్పుడు మనమందరము గలసి యేకముఖముగా నతనితో వాదింపమని శాక్తేయమత మథోగతిపాలైపోఁగలదు సుడీ?

లక్ష్మీ - అవును. అతఁడు సామాన్యుఁడుకాడు. మనలో మనకు భేదము లుండుఁగాక. కలసి శత్రువును పరిభవించుటయే లెస్స.

భవానీ — వామాచారులు మాలోనివారఁగుట వారి నడుగ నవసరములేదు గాని సారస్వతుల కెరింగింపవలయు.

లక్ష్మీ - అదిగో వారును మాటలోనే వచ్చుచున్నారు.

సారస్వతులు — (ప్రవేశించి) రామనాధుని యాలయమునందుండి బాలయతి యెవ్వడో మనలనందఱ రమ్మని వార్తలంపెనఁట యేమిటికి ?

భవానీ - ఏమిటికా! మనమతము ఖండించుటకఁట.

సార - (నవ్వుచు) బాగు బాగు. చిరకాలమునుండి ప్రబలియున్న మన మతమును ఇతఁడా ఖండించువాఁడు !

భవానీ — అట్లనరాదు. అతండు లోకసామాన్యుండుగాఁడు. సకలవిద్యా పారంగతుండని యెల్లరు చెప్పుకొనుచున్నారు. కావున మనమందఱమును గలసి వానితో వాదింపవలయునని యూహింపుచున్నాము.

సార — అది యుక్తమే.

భవానీ - సరే ! మనమేదేవతను ప్రధానముగాఁ జేసికొని వాదించవలయునో ముందుగ నిపు డూహించవలయును.

లక్ష్మీ - మనము లక్ష్మిని ప్రధానదేవతగా నెంచి వాదించితిమేని తప్పక గెలువఁగలము.

భవానీ — ఆదిశ క్తి పార్వతిగాని లక్ష్మిగాదు. కావునఁ బార్వతికే జగత్కారణత్వముఁ జెప్పి వాదింపవలయును.