పుట:కాశీమజిలీకథలు-05.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నని యడిగిన విని తమ దారిద్య్రదోషమునకు వగచుచు నాయింతి తెల్లనిపిండిని నీటిలో గలపి యిచ్చినది. వానింద్రావి యాయర్భకుండు గంతులువైచుచు నా బాలకులయొద్దకుం జని చూడుఁడిదిగో నేనును బాలు ద్రావుచుంటిని. కొంచెమిమ్మని యడిగిన నిచ్చితిరికారు గదాయని వారినూరించెను. అప్పుడా బాలకులు పరికించి ఇస్సిరో? నీవు పిండినీటింద్రావుచుఁ బాలని మమ్ము వెఱపించెదవా? చాలుఁ జాలు, పాలెక్కడ. నీవెక్కడ పో పొమ్ము. దరిద్రుఁడాయని పరిహసించిరి.

వారి మాటలు విని యుపమన్యువు సిగ్గుపడుచు మఱలఁ దల్లియొద్దకువచ్చి అమ్మా? నీవు నాతోఁ బాలనిచెప్పి పిండిని నీటిలోఁగలిపి యిచ్చితివా? ఎంత మోసముఁజేసితివి. అయ్యో నీమూలమున నాకెట్టి యవమానము వచ్చినదో చూచితివా? నన్నువాండ్రు దరిద్రుడా నీవెక్కడ! పాలెక్కడనని పరిహసించిరి. మనము దరిద్రులమా? దరిద్రులన నేమియని తల్లి పైఁబడి నిర్బంధింపఁదొడంగెను. అప్పుడామె మిగుల జింతించుచు, నాయనా యేమియు లేకపోవుటయే దారిద్యము మన పూర్వపుణ్యమట్టిదని నుడివినది. ఆ మాటవిని యా పిల్లవాఁడు, అమ్మా! ఆ దారిద్ర్యమేమి సేసినం బోవునో చెప్పుము. అట్లు కావించెదనని యడిగిన నా సాధ్వి, పట్టీ! యష్టైశ్వరసంపన్నుఁడగు నీశ్వరునారాధించిన నాదారిద్ర్యము త్రుటిలోఁ బాసిపోవునని చెప్పినది. అప్పుడా బాలుఁడు తల్లి తో నాయీశ్వరుడెందున్న వాఁడో చెప్పుము పోయి యాశ్రయించెదనని యడిగిన నప్పఁడతి గుడిలోనున్న శివలింగమును జూపి యితడే యీశ్వరుఁడని పలికినది.

అప్పుడుపమన్యువు గుడిలోనికింజని తలుపులు మూసికొని యా లింగమును రెండు చేతులతోఁబట్టికొని, స్వామీ! నీవు సమస్త లోకనాయకుండవనియుఁ గామితములఁ దీర్చువాఁడవనియు భాగ్యవంతుడవనియు మాయమ్మ నాతోఁ చెప్పినది నీవు మాత్రము సిరిగలవాఁడవై మాకేమియు లేకుండఁజేయుట నీకు దగునా? నేను మొన్నటిదినము పాలులేక మునిబాలకుల నడుమ నెంత యవమానముఁ బొందితిని. అట్లది నీ కొడుకులకు వచ్చిన నెంత చింతింతువు. నాకుఁదండ్రి లేకపోవుటచే నిన్నింత బ్రతిమాలవలసి వచ్చినది. లేకున్న నాతఁడే నాకుఁబాలు దెచ్చియిచ్చును. తండ్రిలేనివారలకు నీవే తండ్రివని మాయమ్మ చెప్పుటచే నిన్నాశ్రయించుచుంటిని. మాటాడవేమి కోపమా? ఇంతకఠినుండవని మా తల్లి చెప్పలేదేమి మిక్కిలి దయాళుడనియు నడిగిన తోడనే కార్యంబులఁ దీర్బుననియుఁ జెప్పినదే నీసంగతి యెరుఁగదు. లేక నీబుద్ధి మాఱినదా? నిజముఁజెప్పుము నాపట్టు నీవెరుంగవు. క్షణమూరకున్న వీఁడేపోవునని యూరకుంటివి కాబోలును. విడుచువాఁడనుకాను. నేను నీకంటె మొండిని. తండ్రీ! కనంబడుము. మాటాడుము అనుగహింపుము. అవమాన దుఃఖముచేత నింత ధైన్యముఁ బొందవలసి వచ్చినది. నాకుఁ గోపము దెప్పింపకుము. వద్దువద్దు మాట్లాడమని యనేక ప్రకారములఁ బ్రతిమాలెను కాని యమ్మహానుభావునకు దయ వచ్చినది