పుట:కాశీమజిలీకథలు-05.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

21

కాదు అప్పుడబ్బాలుండు తన్ను నిందించుకొనుచు సీ! యిక నా జన్మమేల పాలు గొనక వెండియుం జనితినేని మునిబాలకులు నన్ను మిక్కిలి యక్క సక్కెము లాడుదురు. ఈతండు మాటాఁడడు. నా తల్లి యున్ననుఁ బరిహసించును. ఈమాట వీనికే దక్కునుగాక వీనిపైఁబడి శిరము పగులఁగొట్టుకొని ప్రాణములు విడిచెదనని లేచి తన శిరమెత్తి వ్రక్కలగునట్లు గభాలున నా లింగముపైఁ గొట్టికొనునంతలోన

శా. సామేనంబొలుపొందునిందుముఖితోఁ జర్మోత్తరీయంబుతో
    సోమార్దాంచితమౌళితోఁగరలన చ్చూలంబుతో దేవతా
    స్తోమారాధితపార్శ్వభాగములతో శుబ్రాంగకశ్రేణితోఁ
    గామారాతితదగ్రదేశమున సాక్షాత్కారమయ్యెన్ గృపన్.

అట్లు ప్రత్యక్షంబై యప్ఫాలాక్షుం డబ్బాలు నెత్తుకొని, వత్సా! నీ మాటలు విని నేను వచ్చుచుండ నింతతొందరపడియెద వేమిటికి? నీకామితంబేమియో చెప్పుమని యడిగిన విని యుపమన్యుండు సంతసించుచుఁ, దండ్రీ! నాకేమియు నక్కఱలేదు. నాకుఁదండ్రిలేఁడు కావున నేను పిలిచినప్పుడెల్ల నా పనులంజక్క పెట్టుచుండుము. మాయింట పాలు సమృద్ధముగా నుండునట్లను గ్రహింపు మిదియే నా కోరిక యని పలికిన విని యబ్బాలున కవ్వరంబులొసంగి యయ్యనంగవైరి యంతర్హి తుండయ్యె. పిమ్మట నయ్యుపమన్యువు తల్లి యొద్దకుం జని యా వృత్తాంతమెఱింగించినవిని యామె విస్మయావేశహృదయయై పరమేశ్వరుని దయావిశేషంబు నెల్లకాలము గొనియాడు చుండెను. ఉపమన్యుఁడును శివభక్తుండై మహర్షికోటిలోఁ జేరి మిగుల విఖ్యాతుండయ్యెను. మహాత్మా! అట్టి మహానుభావుండు భక్తకల్పద్రుమంబై యొప్పుచుండ మనము చింతింపనేల యతని నాశ్రయింతము మనకామితము దీర్పక మానడు. దేవతలయందు జడత్వమెన్నఁడులేదు. అది మనుష్యుల హృదయములయందున్నది. వీరి చిత్తములు నిశ్చయాయత్తము లయ్యెనేని వేల్పులు తప్పక వరములిత్తురు. కావున శివుని గురించి తపంబొనరింతమని బోధించినవిని సంతసించుచు శివగురుండమ్మరు నాఁడే భార్యతోఁగూడ బూర్ణానదిని స్నానముగావించి దీక్షవహించి కందమూలఫలాశనుఁడై యావృషాచలేశ్వరు నారాధించెను.

మఱియు-

క. పన్నగ కేయూరుమహా
   పన్నగసుశతారు నెడద భావించుచు భా
   స్వన్నీతిఁదపముఁజేసిరి
   కొన్ని దినంబులు జలంబె క్రోలుచువారల్.

ఇట్లత్యంతనియమంబుల నాదంపతులు తపంబొనరింపుచుండ నొకనాఁడు కృపాపరవశుండైన మహాదేవుండు శివగురునికి బ్రాహ్మణవేషంబున స్వప్నంబునం