పుట:కాశీమజిలీకథలు-05.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సభాపతి — ఈ బెదరింపులకు మేము వెరవము. గ్రామస్థు లెవ్వరును రారు. మీ యిష్టము వచ్చినట్లు చేసికొనుఁడు.

పశుపతి — భట్టారకా ! నీవును రావాయేమి ?

భట్టారకుఁడు - బాబూ ! తొందరపడకుము గ్రామస్థులందరు నొక్కటి యైనచో మనము మాత్రము వెళ్ళి ఏమి చేయుదుము?

పశపతి — ఛీ ! నీ జ్ఞాతిత్వమూరక పోనిచ్చితివికావు. అతండు మహానుభావుండు. మనలనందరను భస్మము చేయకమానఁడు. చూడుము అదిగో మనమిందు జాగుచేసితిమని మనకొరకు మనకుమార పాలితుని వెండియుంబంపియున్నాఁడు. రెండుయామము లైనది పోదమురమ్ము.

భట్టారకుడు — కుమారపాలితు నచ్చటి విశేషములడిగి పోవుదముండుము.

కుమార — [ప్రవేశించి] పశుపతి తాతా ! నీవునిందు జాగుచేసితివేల ? మనయగ్రహారము పనిదీరినదిలే.

పశుపతి - ఏమి ! యేమి ! యతండు కోపించినా యేమి ? నేనేమిచేయుదును. గ్రామస్థులందరు నతనికి వెలివేసిరఁట

కుమార - ఎంతసేపటికి నీవును భట్టారకుండును రామి, నొక్కండును తల్లి శవము దాపుననుండి విసిగి కోపముజనింప వీరిగుజగుజల నతండెరిగి తల్లి కుడి భుజముమధించి యందగ్నిఁ బెట్టించి యయ్యగ్ని చేతమమున దొడ్డిలోఁ జతినేర్పరచి తల్లిని దహించెను.

పశపతి - అతని సామర్థ్యమెట్టిదో చూచితిరా ? నేను మెదటనే చెప్పితిని. సన్నికల్లు దాచిన బెండ్లి యాగునా? తరువాత..

కుమార — తరువాత నీ గ్రామస్థుల నుద్దేశించి.

క. శ్రుతిబాహ్యులగుదురిటు పై
   యతులెప్పుడు వీరి గృహములందుఁగుడువరు
   ద్దతివీర పెరటి భూములఁ
   బితృవనములు వెలయునని శపించె నలుకతోన్.

పశుపతి - అయ్యో అయ్యో ! వీరికతంబున విహితులమగు మనముసయితము శాపదగ్ధులమైతిమే. యికేమి చేయుదుము? వేదబాహ్యులమైపోతిమిగదా మన గృహములు శ్మశానములైనవి.

గ్రామస్థులు — [దుఃఖముతో] ఇంతయు నీ సభాపతి మూలమున మూడినది. ఏమియు నెరుంగని వారిని దీసికొనివచ్చి సభలు చేయించి యిట్లనుమని మమ్ము గంగలో దింపినాడు. మేమేకాక మా కులస్థుల నెల్ల జెరిపికొంటిమి. కటకటా !