పుట:కాశీమజిలీకథలు-05.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

143

సభాపతి — ఈ సమాధానముల కేమి లెండి. ఇవేమియు మాకు నచ్చవు. తల్లి బ్రతికియుండఁగా బెండ్లియాడుమని యెంత బ్రతిమాలినను వినక చచ్చిన తరువాతఁ గర్మచేయుమని చెప్పినమాట మాత్రము విని యకార్యకరణమున కుద్యోగించు చున్నాఁడా ? భట్టారకా ! నీవు వట్టి వెర్రివాఁడవు సుమీ.

భట్టారకుడు — అట్లనుచున్నావేమి ? మరియొక హేతువేదియైనంగలదా?

సభాపతి — [రహస్యముగా] శంకరుండు మొదట విరక్తుడై సన్యసించి తన యాస్తినంతయుఁ దల్లితోఁ గూడ నీ యధీనము గావించి యరిగెను గదా? ఇప్పుడా యాస్తియం దాసజనించి తాను రాఁబట్టుకొను తలంపులోఁ దల్లికి గర్మ చేయఁబూనుకొనుచున్నాఁడు. ఈ మర్మము నీవెరుంగక వేరొక విధమునఁ" దలంచుచున్నావు.

భట్టారకుడు — [ఆలోచించుచు] ఇందులకు నేనేమి జేయవలసినది ?

సభాపతి — కర్మచేయనీయకుము. మేమందరము నీకుదోఁడు పడుదుము. మనకు మనకు విధాయకుము. అతండీవేళనుండి ఱేపుపోవువాఁడు.

యజ్ఞ — అయ్యో ! నా కతనితో నేమాట చెప్పుటకు నోరాడదు ఏమి చేయుదును ?

సభాపతి - నీవేమియుఁ జేయవద్దు. ఇందేయుండుము. అతనికి నిప్పైనను దొరకనీయను. వాహకులు మునుపే లేదు. ఏమి చేయునో చూతము.

యజ్ఞ — అదిగో మా పినతండ్రి పశుపతి నా కొరకు వచ్చుచున్నాఁడు. అతనితోఁ గూడఁ జెప్పుము.

సభాపతి — ఎవరు వచ్చిననేమి ? గ్రామస్థులలో బాలుండైన నచ్చటికి రాఁడు.

పశుపతి — [ప్రవేశించి] ఏమిరా భట్టారకా ! యిందు జాగుచేసితివి శంకరుఁడు తొందరపడుచున్నాఁడు ? వాహకులేరీ?

భట్టారకుఁడు - శంకరుఁడు శాస్త్రదూష్యమైన పనిచేయుచున్నాఁడని గ్రామస్థులెల్లరు సభచేసి శంకరునికి వెలివేసిరఁట. వాహకులెవ్వరు రారఁట ! మన మేమిచేయుదుము !

పశుపతి — ఆహా ! శంకరునికా వెలి! గ్రామస్థులెంత మూర్ఖులు అగ్నికిఁ జెదలుపట్టునా ? వీరికెద్దియో మూడినది.

సభాపతి — వీర కేదియు మూడలేదు వారికి మూడియే యిట్టి యకార్య కరణములకుఁ బూనుకొనుట.

పశుపతి - ఛీ ఛీ నోరుమూయి. అతండల్గిన మూడులోకములను భస్మము చేయఁగలడు.