పుట:కాశీమజిలీకథలు-05.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కొందరు — మీకేమో దానధర్మములుచేయుననుతలంపుతో జెప్పుచున్నారు. అతఁడు సన్యాసి. ఇచ్చుట కతనియొద్ద నేమియులేదు. ఎదురు మనలనే యాచించును. కావున మా కిష్టము లేదు. మేము రాము. మీరు పోతిరేని మీకును మాకును భోజనములు లేవు. మొదటనే చెప్పుచున్నాము.

మరికొందరు - అతండు బంధువుఁడని యంటిమి. మీ కట్టి తాత్పర్యమున్నది. కావున బ్బీడయఁడని యిట్టియూహ చేయుచున్నారు. చాలు చాలు మీతో మాకు సహంపక్తి లేకపోతే మాకేమియు లోపము లేదు. మొన్నను ఘటశ్రాద్ధము గావించిన విస్సన్నసోమయాజి నెవ్వఁడు నాక్షేపించినవాఁడు కాఁడేమి ? అంతకంటె శంకరుఁడకార్యకరణమేమియుఁ జేయలేదు. మేము పోవకమానము. అదియునుంగాక యజ్ఞభట్టారకుండు మాకు మిత్రుండైయున్న వాఁడు అతని మొగమైనంజూచి పోవక తప్పదు. మీరు మాకు వెలివేయించినప్పుడు చూతములే.

సభాపతి — ఓహో ! మీరిట్లు స్వతంత్రులై మాడాడుచుండ నా సభాపతిత్వమేమిటికో ? ఏదీ మీరు నా యాజ్ఞలేక శంకరుని యింటి కరుగుఁడు మరుఁడు చెప్పెదను.

మరికొందరు - పోనీ యీ గ్రామములో నుండకుండఁ జేయుదువింతేనా? మరియొకచోటికిఁ బోయెదము. ఇంతకు మేమేమంటిమి ? ఊరక వీరు మమ్మాక్షేపించు చుండ నూరకుందుమా ?

సభాపతి — పైన నేనుండఁగా మీకీ తగవులేలా ! నేనెట్లనిన నందరు నట్లు చేయుఁడు. అదిగో యజ్ఞభట్టారకుం డిట్లు వచ్చుచున్నాఁడు. అతనినిఁ గూడ మనము చెప్పునట్లు నడుచువానిఁగా జేయుదు. చూడుఁడు నా ప్రభావము

యజ్ఞభట్టారకుడు — [ప్రవేశించి] ఏమండోయి సభాపతిగారు అందరు నిచ్చటనే యున్నారు, గనుక చెప్పుచున్నాను. మా శంకదరు తల్లి రాత్రి స్వర్గస్థు రాలైనది. ఇప్పు డపర సంస్కారము శంకరుఁడే చేయ నిశ్చయించినాడు. మిమ్ముల నందరినిఁ దీసుకొనిరమ్మన్నాడు.

సభాపతి - భట్టారకా చెప్పువానికి మతిలేకపోయిన వినువానికి నీకైనను మతిలేదా యేమి? శంకరుండా కర్మచేయుట? ఇట్టి విరుద్ధ మెందైనంగలదా? విద్యాధి రాజవంశము వారెట్టి యకార్య కరణము జేసినను సాగుననియా యేమి

యజ్ఞ — అతఁడు తల్లికిఁ గర్మ చేయుదునని వరమిచ్చెనఁట. అందుమూలమునఁ జేయుచున్నాఁడు. ఎవ్వరేని వచ్చి యడిగిన సమాధానము చెప్పెదననుచున్నాఁడు. ఈ విషయమిందాక వీరవర్మ యడిగిన సమాధానముచెప్పి యతని నొప్పించెనే.