పుట:కాశీమజిలీకథలు-05.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

145

కాలట్యగ్రహారమునకెట్టి యాపద తటస్థించినది. జన్మభూమి యని యతడించుకయు కనికరించక క్రూరముగా శపించెనే ఇది కాటియగ్రహారమైపోయినది

పశుపతి — ఇతండు శాంతుఁడని పీడించిన గోపగించకుండునా? చల్లని దైనను చందనవృక్షము మధించినచో నగ్ని జనకము కాకుండునా ? తేజశ్శాలులకృత్యముల శాస్త్రీయములైనను నింద్యములు కావు. మున్ను పరశురాముండు పితృశాసనంబున దూష్యంబైనను మాతృవధ గావింపలేదా ? అని వారు పశ్చాత్తాపతప్తులగుచు నిష్క్రమించిరి.

అట్లు శంకరాచార్యులు దల్లిని ముక్తినొందించి పద్మపాదుని రాక నరయుచు గేరళదేశమున గొన్ని దినములు కాలక్షేపము గావించిరి.

పద్మపాదుని దీర్థయాత్ర

పద్మపాదుండును గురుచరణ సరసిజంబుల హృదయంబున ధ్యానించుచు సేతుయాత్రకు బయలువెడలి సముచిత శిష్య సహితుండై చనిచని.

క. శ్రీకాళహస్తికరిగి సు
   ధాకర శేఖరు భజించి తానంతనతం
   డేకామ్రనాధు గామా
   క్షీ కాంతుంగాంచి సేవించెదగన్.

మఱియును -

గీ. అని శమీకుఁడు తాండవమాడుచుండ
   నద్రికన్యకవీక్షించు నమలమంద
   హాసశోభితవదనాబ్జ యగుచు నెచట
   గదలెఁదానట్టి పుండరీకమునకతఁడు.

అందు శివుండు తాండవమాడునప్పుడు తచ్చ్రమాపనయనార్ధమై దివ్య గంగంబ్రార్ధించిన తీర్థంబు సన్నిహితంబైనది. దానఁజేసి యత్తీర్థంబు శివగంగయని ప్రఖ్యాతి వడసినది. మరియుం బార్వతీవల్లభుని నాట్యశ్రమ మపనయింప గంగా రూపంబున సన్నిహితయగుటం జేసి యది శివగంగయని పిలువంబడుచున్నదని కొందరు చెప్పుదురు. మరికొందరు నాట్యమాడునప్పుడు శివుని జటాజూటమునందలి జాహ్న వీబిందునందు జారిపడినకతంబున బుణ్యతీర్ధంబై శివగంగయని వాడుక వడసిసదని వక్కాణింతురు. ఆ శివగంగయందు మునింగి శివుని తాండవమీక్షించిన మానవులు విధూతపావులై ముక్తి కరుగుదురు.