పుట:కాశీమజిలీకథలు-05.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

137

వాతఁ బూర్వధర్మములయం దాసక్తి యేమిటికిఁ గల్గెడిని? గృహస్తుండైనను సన్యాసి యైనను మనస్సే కదా ప్రధానము. నీచే వాదంబున నోడిపోయి దృఢమైన బుద్ధితోఁ దురీయాశ్రమము స్వీకరించితిని. పూర్వభ్రమ విడిచితిని పూర్వము నేను గృహస్తుండై యున్నతరి నైయాయకాది గ్రంథములయం దెక్కుడు నమ్మకము కలుగునది భవదీయపాదసేవ లభించిన పిమ్మట నా యనుమానమంతయు వదలిపోయినది. అద్వైతమతమునం దెక్కుడు విశ్వాసము గలిగియున్నది. అట్టి నామనోధర్మముఁ దెలిసికొనలేక నీశిష్యులు నన్ను నిరాకరించిరని పలుకుచున్న సురేశ్వరభారతీస్వాముల వారి కోపవహ్నిని వివేకోదకములచే నడంచుచు శంకరుం డిట్లనియె.

ఆర్యా! నీవు తొందరపడి మదీయసూత్రభాష్యమునకు వార్తికము నిలువకుండునట్లు శపించితివి. అది దైవకృతము. సూత్రభాష్యమునకు వార్తికము లేదనుచింత మదీయాంతఃకరణమున మిక్కిలి బాధింపుచున్నది. ఏమి చేయుదును? కానిమ్ము నేను మదీయశాఖయగు తైత్తిరీయోపనిషత్తునకుఁ ద్వితీయశాఖయగు కాణ్వోపనిషత్తునకు భాష్యములు చేసియుంటిని. ఆరెంటికిని నీవు వార్తికములు రచియింపు మాచంద్రతారకములై పుడమి వెలయునని యానితిచ్చెను. సురేశ్వరుండు గురునానతి శిరంబునం బూని యప్పుడ పూనికతోఁ దైత్తిరీయకాణ్వోపనిషత్తులకు శంకరాచార్యుండు రచించిన భాష్యములకు వార్తికములు రెండు విద్వాంసులు మెచ్చునట్లు కావించి యవి యాచార్యునిపాదమూలమునఁ గానుకగా సమర్పించి యతని కామోదము గలుగఁసేసెను. పిమ్మటఁ పద్మపాదుండును శారీరకసూత్రభాష్యమునకు నాత్మకీర్తి విజయడిండమమగు టీకను నిరవద్యయుక్తిసూత్రమైనదానిఁగా రచియించి గురుదక్షిణగా సమర్పించెను. అందు బూర్వభాగము పంచపాదికయనియు, నుత్తరభాగము వృత్తియనియుఁ బ్రఖ్యాతిఁబొందినది. పిమ్మట హస్తామలకాది శిష్యులును గుర్వాజ్ఞఁ గైకొని మరియు నాత్మతత్త్వప్రఖ్యాపకములగు గ్రంథంబు లనేకములు రచించిరి. అట్లు శంకరాచార్యులు శిష్యులచేఁ బెక్కు గ్రంథములు రచియింపఁజేసి కొన్నిదినము లాశృంగగిరియందు సంతోషముతోఁ గాలక్షేపము జేసిరి. ఒకనాఁడు హస్తామలకుండును జిత్సుఖుండును దుంగబద్రకు స్నానార్థమై యరిగి యిట్లు సంభాషించుకొనిరి.

చిత్సుఖుండు — హస్తామలకా! మన యాచార్యుఁడు నేఁడేమియో ఖిన్నమానసుండై యున్నవాఁ డేమి? పద్మపాదుండు సేతుయాత్ర కరిగెననియా యేమి? మనయందరికన్న వానియం దెక్కుడు తాత్పర్యము సుమీ!

హస్తామలకుఁడు - అగు నందులకే కావచ్చును. పద్మపాదుండు సేతుయాత్ర కరిగెదనని యడిగినప్పుడు మార్గగమనము కష్టమనియు నొంటరిగా పరదేశయాత్రచేయుట క్లేశకరమనియు దారిలో