పుట:కాశీమజిలీకథలు-05.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

కాశీమజిలీకథలు - ఐదవభాగము

విఘ్నములు సమకూడుచుండునని పలికిన శిష్యులు వెండియు నిట్లనిరి. స్వామీ! హస్తామలకునిమాట యటుండనిండు. మీ సెలవైనచో బద్మపాదుండు వార్తికము సేయ నోపడా? అతండు బ్రహ్మచర్యము నుండియే సన్న్యసించిన ధన్యుండనియు లోకమాన్యుం డనియు బుద్ధిమంతుడనియు జగద్విదితమైనదియే కదా! తమకు వానియం దనుగ్రహమేమిటికి గలుగలేదని యడిగిన శంకరుం డిట్లనియె. మీ కందరికి నట్టి యభిప్రాయము గలిగియుండినచో బద్మబాదుండు మదీయభాష్యమం దొకనిబంధము రచించుగాక. వార్తికము మాత్ర మాసురేశ్వరుండే చేయవలయునని చెప్పి యంతటితో నా ప్రస్తావము గట్టిపెట్టెను.

మరియొకనాడు శంకరాచార్యులు సురేశ్వరుం జూచి "ఆర్యా దుర్విదగ్ధులగు మదీయశిష్యులెల్లరు నీవు వార్తికము జేయుటకు సమ్మతింపకున్నవారు. నీవు కర్మతంత్రుడవనియు గృహస్థధర్మరతుండవనియు నిన్ను శంకించుచున్నారు. కావున భాష్యమునకు వార్తికము రచింపకుము. భవదీయసామర్ధ్యము దెలియనట్లుగా ముందుగా నధ్యాత్మతత్త్వంబు దేటపడునట్లు స్వతంత్రముగా నొక గ్రంథము రచించి నాకు జూపుము. నీ గ్రంథరచనాసామర్ధ్యము జూచి యీ శిష్యులకు నమ్మకము గలుగనట్లు చేయు"మని యానతిచ్చి అయ్యో ! మదీయభాష్యమునకు వార్తికము లేకపోయెనే యని యించుక విచారించెను.

అట్లు శిష్యుల ప్రేరణమువలన శంకరాచార్యుండు తన్ను వార్తికము చేయ వలదనియు స్వతంత్రముగా నద్వైతగ్రంథమొకండు రచింపుమని చెప్పిన విని సురేశ్వరుండు మిగుల నీసుంజెందియు నేమియుం బలుకక యల్పకాలములో నైష్కర్మసిద్దియను గ్రంథమొకండు రచించి యాచార్యునికి జూపెను. అట్టిగ్రంథమును జూచి శంకరుండు మిగుల విస్మయము నొందుచు దానిని శిష్యులకు జూపి పెక్కుతెరంగులం గొనియాడెను. ఇప్పటికిని యతీశ్వరు లాగ్రంథమునం దెక్కుడు విశ్వాసము చేయుచుందురు. అట్లు తన గ్రంథమునుజూచి యాచార్యుఁడు సంతసించినంత సురేశ్వరుం దలుకతో నాహా! యీ లోకమున మత్సరగ్రస్తులు పెక్కండ్రు గలిగియుందురు. నే నాచార్యవాక్యంబునం జేసి వార్తికము సేయ నుద్యోగించినంత ననవసరముగాఁ గొందరు విఘ్నము గావించిరి. కానిమ్ము మదన్యుం డెవం డాగ్రంథమునకు వార్తికము జేసినను నిలువక నశించెడుఁ గాత యని శాపం బిచ్చి యల్లన నాచార్యున కిట్లనియె. గురువర్యా! నేను గీర్తికొఱకుఁగాని లాభముకొఱకుఁ గాని వార్తికముచేయ నుద్యోగింపలేదు. గుర్వాజ్ఞ యనుల్లంఘనీయమని యప్పనికిఁ బూనుకొంటిని. పూర్వ మితండు గృహస్థుండనియుఁ గర్మరతుండనియు నాక్షేపించుచు నీశిష్యులు నన్నప్పని కనర్హునిగాఁ దలంచిరి. ఇంతకన్న నవివేక మెందైనం గలదా? అనుభూతంబులైనను బాల్యచేష్టలు యౌవనంబునం బొడకట్టునా? వార్థకంబున యౌవనచిహ్నములు దోచునా? అట్లే సన్యసించిన తరు