పుట:కాశీమజిలీకథలు-05.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

135

అంతలోపల దైవవశంబున నా బాలుం డాడుకొన నిటునటు దిరుగుచు దభాలున నిన్నికటంబుననున్న యమునానదింబడి ప్రాణములు విడిచెను. అప్పుడు తదాప్తు లాక్రందనము చేయుచు వడివడిం బోయి నీటినుండి యబ్బాలుం దీసి ప్రాణములు పోవుట చూచి గోలున నేడ్చుచు నా సిద్ధునిమ్రోల నా బాలశవమును బడవైచిరి. ఇంతలో బ్రభాకరుని భార్య యవ్వార్తవిని యడలుచు నచ్చోటికివచ్చి చచ్చియున్న సుతుని కళేబరముపై బడి అయ్యో! నా ముద్దుకూన! యెంతలో నీల్గితివిరా! నీ మొద్దుమో మెంతలో గళదప్పినది నీ చిట్టిపలకులు విని యెన్ని యో దినములైనట్లున్నదియో అన్నన్నా. యీ సిద్ధుండు మమ్మెంత మోసము చేసెను. తాను మొదట సమ్మతింపకున్నను మా కీముప్పు రాకపోవునే ఇంత దయాహీనుండని యెరింగినచో నితనికురంగట విడువకపోవుదునే. ఇంతలో నెంతపుణ్యము సంపాదించుకొనవలయు ననియో యీ సిద్ధుండు వీనింజూడ కుపేక్షించెను. ఇట్టి కఠినాత్మునకు దపంబెట్లు సిద్దించును? నియమంబు లేమిటికి? సమాధి కాల్చనా? యీ బాలఘాతకుని మొగంబు జూచిన, బాతకము రాదా! కటకటా పెక్కేండ్లు తపంబు జేసి కన్న ముద్దులపట్టిని వీని పొట్టం బెట్టితినే ఏమి చేయుదును. దిక్కెయ్యది? పతి కేమని వక్కాణింతును? సుతుం డేమయ్యెనని చెప్పుదును? ఈ పాడునది కేమిటికి మునుంగవచ్చితిని; హా దైవమా! యని ప్రకారంబుల వగచుచు నా సిద్ధునిం దిట్టుచు నాకాంత బిట్టు వాపోవజొచ్చెను.

అప్పు డమ్మహర్షి తదీయశోకాలాపంబు లాకర్ణించి వగచుచు దన యుపేక్షకుఁ బశ్చాత్తాపము జెందుచు నయ్యపవాదము సైరింపక సమాధి విడిచి యా బాలుని బరీక్షించుచు అయ్యో వీనికొరకు జింతించెదరేల? వీడు బ్రతుకగలడు. క్షణకాలము నిరీక్షించుచుండని పలికి యవ్వల నెక్కడనో తనకాయంబు పాఱవైచి యోగసామర్ధ్యంబుల బరకాయప్రవేశవిద్యానైపుణ్యంబు దీపింప నబ్బాలుని యందు బ్రవేశించెను.

అప్పు డయ్యర్భకుండు కదలి యేడ్చుటయుం జూచి సిద్ధునికృపావిశేషంబునం బాలుడు బ్రతికెనని సంతసించుచు దల్లి యాప్తులతో గూడ నాపుత్రు నెత్తికొని తన నెలవునకుం బోయినది. పిమ్మట నక్కుమారుండు శిశువిలక్షణవ్యాపారములతో మెలంగుట చూచి ప్రభాకరుం డున్మాదవికారంబు లనుకొని యెన్నియో ప్రక్రియలు గావించెను. తరువాయి వృత్తాంతము మీరెరింగినదేకదా! ఆతడే హస్తామలకుండు దానంజేసియే యుపదేశము లేకయే సర్వజ్ఞుండయ్యెను. ఇతం డెరుగనిది యేమియు లేదు. కాని యీతండు బాహ్యప్రవృత్తిశూన్యుం డగుటచే భాష్యంబునకు వృత్తి రచించుటకుం దగడు. సమస్తశాస్త్రసముద్రపారంగతుండగు సురేశ్వరుండ యప్పని కర్హుండు. అతం డొడంబడనిచో దదన్యుం డంతవాడు మరియొకడు గానరాడు. పెక్కండ్ర కిష్టములేని కార్యము కావించుట నా కిష్టములేదు. ఒక మహాకార్యమునకు బెక్కు