పుట:కాశీమజిలీకథలు-05.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

133

నిరి. గురువర్యా! ఇప్పుడు తమ భాష్యమునకు సురేశ్వరుని వార్తికము గావింపుమని యానతిచ్చినట్లుగా వింటిమి. యప్పని మన మనోరథము సఫలము గావింపనేరదు. ఏమిటికంటిరేని వినుండు. ఈ సురేశ్వరుండు, కర్మయే స్వర్గనరకాదిఫలము నిచ్చునని వాదించుచు యుక్తిప్రయుక్తులచే బ్రహ్మాదులకుసైత మీశ్వరుండైన పరమేశ్వరుని నిరాకరించెను. ప్రత్యక్షసన్నిహితంబగు జగంబులకుఁ బ్రళయము పురాణములు చెప్పుచున్నవి. అట్టి పురాణకర్తయగు వ్యాసమహర్షికి శిష్యుండైన జైమినిముని మతము విరుద్ధ మేమిటి కంటివేని గురుశిష్యమతములు రెండును పరస్పరవిరోధకములై యున్నవి గదా. దానంజేసి శిష్యునిమతము పూర్వపక్షమైనదానిఁగాఁ దలంపవలయు అట్లు తలంపక సురేశ్వరుండు పుట్టినది మొదలు కర్మలయం దిష్టము గలిగి సంతతకర్మలం జేయుచు నెల్లరను "గర్మలంజేయుఁడు స్వర్గాదిఫలంబులం బొందుఁడు. వృథాగా మరియొకమార్గంబునం బడి చెడిపోవకుఁడు" అని బోధించుచుండెడివాఁడు. అట్టివాఁడు మీయానతిఁ బొంది భాష్యమునకు వార్తికము రచించినను దానిఁ గర్మపరత్వముగా సూచించక మానఁడు. మరియు సన్న్యాఁసి యయ్యు గర్మరతుండగునా? యంటిరేని యితండు బుద్ధిపూర్వకముగా సన్న్యాసమును స్వీకరించినవాఁడు కాఁడు. వాదంబున నోడి బలవంతమున నట్టి నియమమును స్వీకరించినది మీ యెరింగినదేకదా. కావున నితనియందు విశ్వాసము సేయరాదు. ఇతనిచే వార్తికము రచించుకొనుట లెస్సగాదు. మీ యెరుంగనిది కలదా? కర్మాసక్తుం డెన్నఁడైనఁ గర్మ విడుతునని చెప్పుట కిష్టపడునా? భట్టమతపక్షపాతియగు నితని సన్న్యాసము జాత్యంధాదుల సన్న్యాసమువంటిది కాని మరియొకటికాదు.

మీ రిప్పనిఁ జక్కగా నాలోచించి చేయవలయును. మీ శిష్యులలోఁ బ్రధానుండగు పద్మపాదుని సామర్థ్యము మీరెరుంగనిదియా ?

సీ. గురుభక్తి నవ్వలిదరినుండి పిల్చినం
          తన వచ్చెఁ గంగఁ బాదముల నిడుచు
    నరయక వ్యాసమహర్షితో వాదించు
          నప్పుడు నేర్పుతో నతనిఁ దెల్పె
    నమరుక నృపశరీరమున నున్నప్పుడు
          గాయకుండై బోధ గలుగఁజేసెఁ
    గాపాలికుఁడు మస్తకముఁ ద్రెంపఁ గమకింప
          నరసింహుఁడై వానిఁ బరిభవించెఁ.

గీ. జాయపోలిక మీవెంట సంచరింపు
   చాంతరంగికభక్తుఁడై యలరె నట్టి