పుట:కాశీమజిలీకథలు-05.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

131

రంగమున మెచ్చుకొనుచుండెను. ఇట్లుండ నొకనాడు శంకరుండు వాడుకసమయమునకు మఠంబునం గూర్చుండి శిష్యులకు బాఠము జెప్పబోవు సమయమున నా బ్రహ్మచారి యెందు బోయెనని యడిగెను. అప్పుడు మరియొక శిష్యుడు స్వామీ యతండును నేనును దమ శాటీపటంబుల నుదుకుటకై తుంగభద్రకుం బోయితిమి. నేను నా పని వేగముగా దీర్చుకొని పాఠము చదువువేళ మిగులునను వెఱపుతో వడిగా జనుదెంచితిని. వా డూరక యుదికినదే యుదుకుచు గాలహరణము జేయుచున్నాడు. నేను బాఠము చదువ రమ్మని పిలిచినను వినుపించుకొనక యిదిగో వత్తు నదిగో వత్తునని నన్నుఁ గూడ రెండు గడియలు నిలిపెను. వానికిఁ బనియందుఁగల శ్రద్ధ చదువునం దుండదు. కాకున్న నింతజాగు సేయునా? యని పలికి యూరకుండెను. అప్పు డాదయాళుండైన శంకరుండు వానిరాక నిరీక్షించుచు రెండుగడియలు పాఠము చెప్పుట నిలిపివేసెను. వాఁ డప్పటికిని రాకున్నఁ బద్మపాదుండు లేచి స్వామీ! యతండు మందబుద్ధి. గోడవంటివాఁడు. ఏమియుం దెలియదు. ఊరక వినుటయేకాని విద్యాగ్రహణశక్తి యించుకయునులేదు, శబ్దములైనను రావు. అట్టి మూఢునకు మాపాఠములను వినుటవలనం బ్రయోజన మేమి యున్నది? వానికి శాస్త్రాధికార మెక్కడ నున్నది? మాకుఁ జెప్పుడని పలికిన విని పద్మపాదుని గర్వోక్తులఁ బరిహసించు తలంపుతో శంకరుం డిట్లనియె.

పద్మపాదా! వానిసామర్ధ్య మేమి యరసి నీ వట్లంటివి. వాఁడు మీయందరికన్న విద్యలలో నధికుండు. కవి, వక్త, ప్రోఢుండు, అంతర్ముఖుండగుటచే వాని మహిమ మీకుఁ దెలిసినదికాదు. వచ్చిన తరువాతఁ బరీక్షించి చూడుఁడని పలుకుచుండఁగనే యుదికిన కషాయచేలంబులు బుజములమీద నిడికొని యచ్చోటి కరుగుదెంచెను.

వానింజూచి గురుండు గిరీ? పాఠము చదువవలయు వడిగా రమ్ము శాటులఁ బిమ్మట నారవేయుదువుగాని యని చీరినను వాఁడు విడువక శ్రద్ధగా బట్టలు నారవేసి యచ్చోటి కరుదెంచెను. అప్పుడు శంకరుండు వానికి మనసుచేతఁ బదునాలుగువిద్యలు వచ్చునట్లనుగ్రహించెను. అప్పుడు వా డఁఖిలవిద్యాప్రవీణుండై చేతులు జోడించుచు శంకరాచార్యునిఁ దోటకవృత్తములచే నిట్లు స్తుతిఁజేసెను.

శ్లో॥ భగవనుదధౌమృతి జన్మఝలె
     సుఖదుఃఖఝరె పతితంవ్యధితం
     కృపయాశరణాగతముద్దరమా
     మనుశాధ్యుపపన్నమనన్యగతిం॥ 1

శ్లో॥ వినివర్త్యతరీం విభయేవిషమాం పరిముచ్యశరీరవిబద్ధమతిం॥
     పరమాత్మ పదెభవనిత్యరతోజహి మోహామయం బ్రమమాత్మమతే॥ 2