పుట:కాశీమజిలీకథలు-05.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

కాశీమజిలీకథలు - ఐదవభాగము

   దురితభంగకమగు శృంగగిరివరంబు
   శంకరాచార్యు డరిగె సచ్ఛాత్రు డగుచు.

వ. అమ్మహాస్థలంబు శృంగేరియనియు శృంగగిరియనియుం బ్రఖ్యాతి వహించియున్నది. అప్పవిత్రక్షేత్రంబు బ్రవేశించి శంకరాచార్యు డందుగల సత్పురుషులను దా రచించిన భాష్యాది గ్రంథము లన్నియు జదివించి వ్యాపింపజేసెను. మరియొకనాడు శంకరుండు పద్మపాదుం జూచి "వత్సా! యీ పుణ్యస్థలంబు శారదాంబను నిలుపుట కుత్సాహము గలుగుచున్నది. తత్పరికరములు సమకూర్పవలయును. ఇందు మఠము గట్టింపవలయును" నని పలుకుచు సర్వశిల్పములు నావిర్భవింప నింద్రవిమానకల్పమగు ప్రాసాదమొకటి కల్పించి బ్రహ్మాది దేవతలకు సైతము వందనీయ యగు మహాదేవిని ప్రార్ధన జేసెను.

అమ్మఠంబున నా శారదకు విద్యాపీఠపూజ గావింప దన శిష్యులలో బ్రధానుండగు సురేశ్వరుని నధ్యక్షునిగా నియమించెను. ఆ శారదాంబ మున్ను దాఁ గావించిన ప్రతిజ్ఞ పరిపాలించుచు నిప్పటికి శృంగేరిపురంబున భక్తాభీష్టప్రదానకల్పకంబై విరాజిల్లుచున్నది.

తోటకాచార్యుని కథ

శంకరార్యు డందు శిష్యులతో గొన్నిదినంబులు వసియించియుండ నొకనా డొకబ్రహ్మచారి వచ్చి యతని పాదంబులం బడి, "మహాత్మా! నేను మూఢుంఢ, విద్యాశూన్యుండ, బశుప్రాయుండ, నీకు శిష్యత్వము జేయుతలంపుతో నరుదెంచితి. నాపే రానందగిరి యండ్రు విద్యాగంధరహితులగువారు బెక్కండ్ర శిష్యులగా స్వీకరించి విద్వాంసులం జేసితి వనినఖ్యాతి విని ని న్నాశ్రయింపవచ్చితిని నీవు పరమకారుణికోత్తముడవట. నిన్ను శరణు జొచ్చితిని. నన్ను రక్షింపుము. శిష్యునిగా ననుగ్రహింపు"మని యనేకప్రకారంబుల బ్రార్థించెను. అప్పుడు శంకరాచార్యుడు మందహాసము జేయుచు వాని శిష్యునిగా గైకొనియెను. అది మొదలా బహ్మచారి గురుండు గూర్చుండ గూర్చుండును. నిలఁబడ నిలువంబడును. నడిచిన ననుగమించి నడుచును. బరుండిన మెల్లగా బాదము లొత్తును. చెప్పినపని శ్రద్ధాపూర్వకముగా గావించును. ముందుగా స్నానము జేసి గురుండు గూర్చుండుటకు గంబళాదికమును పరుచును శాటీచేలముల భక్తితో నుదుకును. గురుండు బాహ్యాదిక్రియల కరిగినంత దంతకాష్ఠాదికము దెచ్చి యమరించియుంచును. గురుని సమీపమున నెన్నడు నావులించడు. పాదముల జాచఁడు. పెక్కులు పలుకడు. ఛాయవలె గురు ననుసరించి తిరుగుచు భక్తిపూర్వకముగా శుశ్రూషఁ గావింపుచుండెను. చిత్తానువర్తియైన యా శిష్యుని నిష్కాపట్యభక్తివిశ్వాసములకు శంకరాచార్యు లంత