పుట:కాశీమజిలీకథలు-05.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కొనిపోవుచున్న సమయంబున వీథుల నిలువంబడి పౌరకాంతలెల్ల నిట్లు చెప్పుకొనఁదొడంగిరి.

సీ. ఇతఁడటే పేదపారుతనింట గనకామ
          లకవృష్టి గురిపించిన కరుణాత్ముఁ
    డితఁడఁటే తనతల్లివెత వాయుఁ బూర్ణాన
          దిని వీటిదరికిఁ దెచ్చిన మహాత్ము
    డితఁడఁటే యద్భుతగతిం బొంగు నర్మదా
          ధునిఁ గుంభమున నిమిడ్చిన ఘనుండు
    ఇతఁడఁటే యద్వైతమతము నిల్పఁగ వాద
          మున సరస్వతి జయించిన మనీషి.

గీ. ఇతఁడఁటే మొన్నమూకాంబయింటిమ్రోలఁ
   గాలగతి నొందు బాహ్మణబాలకు గని
   గరిమఁ బ్రతికించినట్టి విఖ్యాతయశుఁడు
   శంకరాచార్యుఁ డితఁడఁటే చంద్రవదన.

అని యిట్టు పౌరకాంతలు కొనియాడచుండ శంకరాచార్యుండు శిష్యులతోఁ గూడఁ బినాకపాణియాలయంబునఁ బ్రవేశించి బృందాకరబృందపరివృతుండగు పురుహూతుండువోలె నాబ్రహ్మణబ్బందము నడుమ విరాజిల్లుచు నల్ల ననయ్యతితల్లజుండు వారికిట్లనియె.

ఆర్యులారా! యీ యగ్రహారమున బెక్కండ్రు పండితు లుండవలయును. అద్వైతమార్గనిరోధకుడై ప్రవృత్తిశాస్త్రరతుండైన పండితుం డెవ్వడేని గలండేని వక్కాణింపుడు. అట్టివారితో వాదించి వారి దురూహలం బోగొట్ట నరుదెంచితిమి. అని యడిగిన నా బ్రాహ్మణులు సవినయముగా నిట్లనిరి. ఆర్యా! భవదీయప్రజ్ఞాప్రభావంబు లింతకు బూర్వమే మేము వినియున్నవారము బృహస్పతియు ఫణిపతియు సరస్వతియు మీకు జాలరనుచో మా బోటులమాట జెప్పనేల. మా యగ్రహారంబున బ్రభాకరుండను పండితుం డొకండున్నవాడు. అతండు ప్రవృత్తిశాస్రైకరతుండై కర్మకాండయందు మిగుల నాసక్తి గలిగి యనేకాధ్వరములు సేసి వేల్పులం దృప్తిపరచి యున్నవాడు. ధనభూకనకవస్తువాహనసమృద్ధి యద్ధరణీసురవరున కెంతేనిం గలిగియున్నది. అతండు భట్టపాదుని శిష్యుండై పూర్వము దిగ్విజయము చేసినాడు. కాని యతనికి లేక లేక కలిగిన పుత్రు డున్మత్తుం డయ్యెను. కావున నిప్పు డతం డాచింతచే నేపనికి బూనుకొనకున్నవాడని చెప్పుచుండగానే యా ప్రభాకరుడు కుమారునితో కూడ నచ్చటికివచ్చి యుపాయనార్పణపూర్వకముగా శంకరాచార్యునికి నమస్కరించెను.