పుట:కాశీమజిలీకథలు-05.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

కాశీమజిలీకథలు - ఐదవభాగము

యింటికి వచ్చిన శివగురుని వార్తవిని బంధుజనము సందోహముగావచ్చి చూచుచుండుటయు శివగురుండు వారినెల్ల నాదరపూర్వకముగా బల్కరింపుచు సంతోష పెట్టు చుండును.

మఱియు విద్యాధిరాజు బంధుసమక్షమందు శివగురుని విద్యాపాటవము దెలియగోరి వేదమునందు భట్టపాద ప్రభాకరకణాద గౌతమ సంఖ్యాది మతసిద్ధాంతముల యందును తర్కవ్యాకరణాది శాస్త్రములయందును ప్రశ్నలువేసి యడుగుటయు నవ్వటూత్తముండు గురునికి నమస్కరించి మందహాసశోభితవదనారవిందుడై యా ప్రశ్నములకెల్ల యుక్తియుక్తముగా దేటమాటలతో సమాధానము జెప్పెను. విద్యాధిరాజు పుత్రుని పాండిత్య ప్రకర్షకు మిక్కిలి సంతోషమును జెందెను సంస్కారరహితములైనను గుమారుని వచనంబులు శ్రవణసుఖం బొనరించుననుచో సంస్కారయుక్తము లయ్యెనేని యేమి నుడువదగినది. అల్పకాలములో శివగురుని విద్యాతిశయము బంధుముఖముగా నాదేశంబంతయు వ్యాపించినది. విద్యాకులగుణశీలాదులచే నిరుపమానుండగు శివగురునికి గన్నెలనిచ్చు తాత్పర్యముతో బెక్కండ్రు ధనికులైన బ్రాహ్మణులు విద్యాధిరాజు మందిర మలంకరించిరి.

శివగురుని వివాహము

అప్పండితుండు వారిచరిత్రల నెల్లవిని వారిలో ధనమున సామాన్యుండైనను గుణశీలాదులచే ప్రఖ్యాత ప్రభావుండగు మఖపండితుండను విద్వాంసుని పుత్రికను గుమారునకు జేసికొనుటకు సమ్మతించెను. పిమ్మట దైవజ్ఞులచే నిరూపింపబడిన శుభలగ్నమందు మఖపండితుండు సతియను పేరునం బరగుగు తనకూతు సతీతిలకమును దీసికొనివచ్చి విధివిధానమున విద్యాధిరాజు మందిరముననే కన్యదానము గావించెను. ఆ వివాహ దినములలో గావించిన యుత్సవములాదేశపు ప్రజలు పెద్దకాలము వఱకు నబ్బురముగా చెప్పుకొనుచుండిరి అవ్వధూవరు లొండొరుల జూచుకొని యపూర్వం సంతోషమును జెందుచు బార్వతీపరమేశ్వరులవలె బ్రకాశించిరి. మరికొంతకాల మరిగిన వెనుక శివగురుండు యజమానుండై సతీదేవితోగూడ ననేకాధ్వరములు గావించి దేవ భూదేవతల సంతుష్టులం జేసెను పెక్కేల నతండు గావించు యజ్ఞములలో హవిస్సుల సేవించెడు వేల్పులు అమృతమును మరచిపోయిరి. తత్తత్పరార్ధములచే బితృ దేవ మనుష్య కోటుల వాంఛితముల దీర్చుచు సుమనోమనోహరుండగు నా శివగురుని జంగమ కల్ప ద్రుమమని యెల్లవారు పొగడదొడంగిరి.

ఆ సుకృతికి బరోపకారమే వ్రతము. వేదపఠనమే నియమము. విహితములే నిత్యగృత్యములై యున్నవి. అతండు రూపంబున మన్మథుండు క్షమచే ధరిత్రియు