పుట:కాశీమజిలీకథలు-05.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

17

ఆద్యాది హవిస్సువలన నగ్ని చల్లారక మఱియుం బెచ్చు పెరికి నట్లనుభవించుటచే గామంబులు వృద్ధియగును. కాని క్షీణింపవు. గృహస్తుడు గృహోపకరణముల బూర్తిజేయు తలంపుతో నున్నవానివలని దృప్తినొందక లేనివాని విషయమై కృతప్రయత్నుండగుచు సంసార సాగర మగ్నుండగును. దానంజేసి పూర్వపుణ్యము నశించుటయు, రాబోవు సుకృతముచెడుటయు, నిలిచియున్న పుణ్యము క్షీణించుటయు దటస్థించును. కావున గృహస్థాశ్రమమున సర్వదా దుఃఖమేకాని సుఖలేశము లేదు. నేను భవదీయకృపావిశేషంబునం బొడమిన వైరాగ్యలాభంబునం జేసి యీ బ్రహ్మచర్యాశ్రమము నుండియే తురీయాశ్రమమును స్వీకరింతు నన్ననుగ్రహింపుడని యనేక ప్రకారముల స్తోత్రములు గావించెను. అప్పుడుపాధ్యాయుడు తదీయ వైరాగ్య ప్రవృత్తికి మిక్కిలి యచ్చెరువందుచు విద్యాధిరాజునకు నవ్విషయము వార్తనంప దలంచునంతలో దైవవశంబున బుత్రుందీసి కొనిపోవ నప్పండితో త్తముం డరుదెంచిన జూచి యుపాధ్యాయుండు సహాధ్యాయునకు నాదరంబున నర్ఘ్యపాద్యాది క్రియకలాపంబులు నిర్వర్తించి స్వాగతంబడిగి పిమ్మట నిట్లనియె.

సూరిసత్తమా! నీ కుమారుండఖిలవిద్యా పారంగతుండయ్యును ఉపనిషదర్ధముల జక్కగా దెలిసికొనియెను. వైరాగ్యోదయము లెస్సగా జనించినది. మీ కులంబునకు మిగుల బ్రఖ్యాతి యీతని మూలమున రాగలదు. ఇప్పుడు గృహస్థాశ్రమమును స్వీకరింపదగియున్నవాడు వీనిందీసికొనిపొమ్ము. వానిమతి వేఱొకరీతిగా నున్నదని పలికిన విని సంతసించుచు విద్యాధిరాజిట్లనియె. ఆర్యా! యిదియంతయ నీ యక్కటికంబున లభించినది. పుత్రునివలె జూచి విద్యలంగఱపితివి నీ యుపకార మెన్నటికిని మఱువము వీనింజూడ వీని తల్లి మిగుల నుత్సుకత్వముం జెందుచున్నది. వివాహప్రయత్నమును జేసితిమి. పెక్కండ్రు విద్వాంసులు కన్నెల నిత్తుమని మా యింటికి వచ్చుచుండిరి వీనికి గృహగమనంబున కనుజ్ఞయిండని పుత్రుండు వినుచుండ నగ్గురుని గోరికొనిన నతండును [సాదరముగా] సమ్మతించితిని. సంతోషవార్త వింటినని యుత్తరమిచ్చెను. అప్పుడు శివగురుండు గురుని మోము జూచుచు మెల్లగా దన యుద్యమము వెండియుంజెప్పిన విని శివగురుండు యగ్గురుండేకాంతముగా వాని చెవిలో నేదియోచెప్పెను. ఆమాటవిని శివగురుండు మాఱుమాట పలుకక గురునాజ్ఞగైకొని తండ్రి వెంట నింటికిం జని జనని పాదంబులంబడి నమస్కరించెను. ఆమెయు నతని గ్రుచ్చియెత్తి ముద్దాడుచు జిరవిరహమువలనం గలిగిన పరితాపము శమింప సంతోషసముద్రంబున మునింగెను. తరుచు పుత్రాలింగన సుఖము కర్పూర చందనాదులకన్న జల్లగా నుండి యాహ్లాదపెట్టును గదా! చిరకాలము గురుకులవాసముజేసి సకలవిద్యలం జదివి