పుట:కాశీమజిలీకథలు-05.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కొనుము. ప్రసన్నుండనై కామ్యంబు లీడేర్తునని పలుకుచు నానృసింహదేవుం డంతర్హింతు డయ్యెను. నాటంగోలె నా కమ్మహానుభావుం డభీష్టదేవతయై తోడ బల్కుచుండును. ఇందాక యిద్దురాత్ముండు మనయాచార్యుని మోసముచేసి శూలంబున శిరంబు దరుఁగ బ్రయత్నించుచున్న సమయంబున నే నేమిటికో యచ్చటి కరిగి యయ్యుపద్రవము గాంచి మదభీష్టదేవతం దలంచితిని. అతండు న న్నావేశించి శత్రువధ గావించెను. యించుక దడసినఁ గార్యంబు మిగిలి మనయాచార్యుండు మనకుఁ దక్కకపోవును. ఇప్పటికి దైవము మనయందే యుండెను. వాదవిజితులు పెక్కండ్రు మనయాచార్యునికి మోసము చేయదలంచుచుండిరి. మనము ఏమరక కాచియుండవలయు. నగ్నిం గీటకములు చేరిన నశింపకుండునా? యవతారమూర్తి యగు మనయాచార్యు నెవ్వ డేమి చేయఁగలఁడని పలుకుచుఁ బద్మపాదుండు వారికెల్ల నామోదము గలుగఁజేసె. అట్లు శంకరాచార్యుండు శ్రీశైలంబునఁ గొన్నిదినములు గడిపి యటఁ గదలి శిష్యులతోఁగూడ ననేకపుణ్యతీర్థంబులు సేవించుకొనుచు గ్రమంబున గోకర్ణక్షేత్రంబున కరిగెను. కైవల్యకల్యాణలాభం బొనఁగూర్చి నద్దివ్యక్షేత్రంబున మూఁడుదినంబులు వసించి మహాకాళనాథు నారాధించి యచ్చటి కనతిదూరములో నున్న హరిశంకరంబను దివ్యస్థలంబున కరిగి యం దద్వైతబుద్ధితో హరిహరస్తుతి గావించెను.

పదంపడి మూకాంబికాగేహమున కరిగినంతఁ దదీయద్వారదేశంబున బ్రాహ్మణదంపతులు మృతుండైన కుమారుని కళేబరమును వైచికొని యిట్లు విలపించుచుండిరి.

ఉ. హాకులదీపకా! హిమకరాధికతేజ! కళానిధాన ల
    క్ష్మీకరమూర్తి సద్గుణనికేతన హాసుకుమార హాకుమా
    రా! కడతేర్చెనే నిను దయూరహితుండు కృతాంతుఁ డయ్యయో
    యేకడ కేగువారము త్వదేకశరణ్యుల మేది దిక్కిఁకన్.

క. నీవలనఁ గులము దీపక
   మై వర్ధిల్లెడు నటంచు నౌత్సుక్యం బెం
   తే వెలయ నలరుచుందు మిఁ
   కేవిధమున బ్రతుకువారు మేము కుమారా!

అని యనేకప్రకారంబుల దుఖించు నద్దంపతుల పరిదేవనంబు విని దయాళుండైన శంకరాచార్యుండు సైరింపక తాను వారికన్న నెక్కుడు విలపించుచున్న సమయంబున నాకాశవాణి యిట్లు విననయ్యె.

క. అనఘా! ప్రోవఁగన సమ
   ర్థునిదయ కేవలము శోకదోహలమగుఁగా
   వినిజప్రజ్ఞాన్వితుఁడవు
   చనునే నీ కిట్లు వగవ సామాన్యుక్రియన్.