పుట:కాశీమజిలీకథలు-05.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

123

నే నెఱుంగుదును. తరుచు మే మిరువురము కలిసికొని యాడుకొనుచుందుము. ఆయన యున్నచోటు నే నెఱుంగుదునని పలికిన విని నేను వెరఁగందుచు వానిమాట నమ్మక, మఱియు నిట్లంటిని.

ఓరీ! నీ వతండు సామాన్యు డనుకొంటివి కాబోఁలు. నే నన్నమాట నీకు దెలిసినదా? కంఠమువఱకు మనుషుఁడు శిరము సింగము ఇదియే పోలిక. అట్టివాని నిశ్చయముగాఁ జూచితివా? యెట్లు నీకుఁ గనంబడియెను. నిజముఁ జెప్పుమని యడిగిన దిరుగ వాఁ డిట్లనియె అయ్యా! నాతో నిన్నిమాఱులు చెప్పనక్కఱలేదు. మీమాట నాకర్ద మైనది. మీరడిగినవాఁడు నేనాడుకొనువాఁడే సందియములేదు. ఇంతయేల? ఇప్పుడే పోయి నీయొద్దకుం తీసికొనివచ్చెదం జూడుము. అప్పుడును నామాట నమ్మకపోవుదువా? యని పలుకుచుఁ దటాలునలేచి యాయరణ్యములోని కరిగి రెండుగడియలలో నక్కిరాతుం డానరసింహమూర్తి నొకలతాపాశంబునం గట్టి భుజముమీదఁ పెట్టికొని యమ్మహాత్ము నాయొద్దకుఁ దీసికొనివచ్చి ముందుఁబెట్టి యీతండేనా నీయడిగిన యతండని పలికెను. అప్పుడు నే నమ్మహాత్ముం జూచి యాశ్చర్యసంభ్రమసాధ్వసంబులు మనంబున నొక్కసారి యంకురించి తొట్రుపరుప నిరుపమానకౌతూహలంబుతో మేనం బులక లుద్భవింప సాష్టాంగనమస్కారము గావించి చేతులు జోడించి.

సీ. నిరుపమాత్మసమాధినిష్టులయోగిచే
          జనులాత్మ నెవ్వానిఁ గనగనోప
    రామ్నాయతత్త్వరహస్యంబు లెవ్వాని
          సన్మహత్త్వము దెల్పఁజాలవయ్యె
    బ్రహ్మాదినిర్జరుల్ ప్రౌఢనెవ్వాని మా
         యాజాలములఁ దెలియంగలేరు
    బ్రహ్మాండములనెల్ల రచియింపఁ బాలింపఁ
         బొలియింప నెవ్వాఁడు మూలకర్త

గీ. అట్టి నీ విప్పు డొక్కమూఢాత్ముఁడైన
   బోయిబాలున కగ్గమై పోయితేమి
   చిత్ర మిది యెట్టిపుణ్యంబుఁ జేసెవాఁడు
   పూర్వభవమున గరుణాప్రపూర్ణహృదయ.

వ. అని నేను వేఁడుకొన నమ్మహాత్ముండు నవ్వుచు వత్సా! వీనికి నాయందు గల భక్తివిశ్వాసములు బ్రహ్మాదులకులేవు. నిరుపమానైకాగ్రచిత్తముతో వీఁడు నన్నారాధించెను దానంజేసి వీని కింతవశ్యుండ నైతిని నేను భక్తికి వశ్యుండనైనట్లు తపోదానయాగాదులకుంగారు. నీవును నాకుభక్తుండవైతిని. అవసరంబైనప్పుడెల్లఁ దలంచు