పుట:కాశీమజిలీకథలు-05.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

కాశీమజిలీకథలు - ఐదవభాగము

దేవతవు. అస్మత్కల్పితములగు ఋష్యశృంగాదికక్షేత్రములయందు శారదాభిఖ్య వహించి సన్నిహితవై యిష్టార్థముల నొసంగుచుండవలయును. ఇదియే నా ప్రార్థన యని పలికిన విని యప్పలుకులవెలంది కులుకుచు నయ్యతిపతి కట్టివరం బిచ్చి యచ్చిగురుబోణి బ్రహ్మలోకంబునకుం జనియెను.

ఆత్మీయసన్యాసస్వీకారంబునం గలుగు వైధవ్యవ్యధ నెరుంగకుండ నుభయభారతి యంతర్హితయయ్యెనని మిగుల సంతసించుచు మండనమిశ్రుండు విధిపూర్వకముగా నప్పుడ ప్రాజాపత్యేష్టిఁ గావించి ధనకనకవస్తువాహనాదికమంతయు బ్రాహ్మణులకుఁ బంచిపెట్టి యగ్నుల నాత్మారోపణఁ జేసికొని యాశాపాశంబులం ద్రెంచి శంకరాచార్యునొద్ద కరిగెను.

గీ. ఘనత సన్న్యాసగృహసూక్తవిధిచిత
    సకలకర్మలఁ దీరిచి శంకరుండు
    ప్రౌఢి జపియించె సంసారభయము వాయ
    తత్త్వమసి యనువాక్య మత్తపసిచెవిని.

ఉ. మండనమిశ్రుఁడు న్విహితమార్గమునం జరమాశ్రమవ్రత
    స్థుం డగుచు న్నియామకముతో హితభిక్షను గోర నయ్యతీ
    శుండును నాత్మతత్త్వమును సూచనఁజేయుచు వేదమస్తకో
    న్మండనమైన తత్త్వమసి నాఁ జను వాక్యమె పల్కెఁ గ్రమ్మఱన్.

శంకరుఁడు — తత్త్వమసియ నఁగా అయ్యాత్మ తత్త్వము నీవయితివని యర్ధము.

మదనుఁడు - నీవనఁగా నీ దేహమేనా ?

శంకరుఁడు — కాదు. కాదు. జాతిరూపాదికము గలుగుటచేతను దేహ మనాత్మ యైన ఘటాదికము వంటిది అదియునుంగాక యీ దేహము నాదియను భేదప్రథ గలిగియుండుటంబట్టి నీవను శబ్దార్థము దేహమునకుఁ జెల్లదు.

మండనుండు — పోనీ యింద్రియములకు వర్తించునా యేమి?

శంకరుఁడు — ఇంద్రియములకును వర్తించదు. ఇంద్రియములు దాత్రాదికము వలెనే సాధనములైనవి. అవియు ఘటాదికము వంటివే ఈ చక్షురాదికము నాయది యనుభేదభావము వానియందు సైతము పొడముచుండలేదా? కావున నింద్రియముల నాత్మగాఁ జెప్పరాదు.

మండనుఁడు — మనస్సు నాత్మయని చెప్పిన దోషమేమి?

శంకరుఁడు — అదియు నింద్రియమే. నా మనస్సు మరియొకలాగునఁ బ్రసరించుచున్నదను భేదభావము వానియందునుఁ గలుగుచున్నది. సుషుప్తియందు