పుట:కాశీమజిలీకథలు-05.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

కాశీమజిలీకథలు - ఐదవభాగము

పాయములచే నాటంకము పెట్టిరి. కాని వారి మాటలు లెక్క సేయక యది నిద్రకాదని యట్లు తల్లక్షణము లన్నియుఁ బరీక్షించి యాశవమును బలాత్కారముగాఁ బట్టుకొని యందొక చితి యేర్పరచి వానింపై బెట్టి యగ్ని యంటించితిమి.

ఆ బాపనయ్యలు తమ శక్తికొలది నాశవమును గాల్పకుండు బ్రయత్నములఁ జేసిరి. కాని వారికంటె మేమెక్కుడుగా నుండుటచే వారి యుద్యమములేమియుఁ కొనసాగినవికావు. చిటచిటారావములతో నగ్నిప్రజ్వరిల్లుచుఁ బెల్లగుజ్వాల లుప్పతిల్ల నా శవమును చేతులు మాత్రమంటుకొనువఱకుఁ దటాలున లేచి కూర్చుండి ప్రాణములతో నాయన చితినుండి నేలకురికెను. అప్పుడు మేము భయపడుచు బాఱిపోయి యీ ప్రాంతమందున్న కుంజంబుల దాగి చూచుచుంటిమి.

అప్పు డాయనను జుట్టుకొని యాబ్రాహ్మణు లెద్దియో ప్రసంగముఁ గావించిరి. పిమ్మట నతండు కన్నులు మూసికొని యేవియో కొన్ని శ్లోకములు చదివెను. అంతలో నతని చేతులు యథాపూర్వముగా విరాజిల్లినవి. ఇంతపట్టు చూచి వేగముగా నా వృత్తాంతము మీకెఱింగింప వచ్చితిమి. అతఁడు మిక్కిలి మహానుభావుండని తోచుచున్నది. తెలియక యపరాధము గావించితిమి. మాలో నొకని కింటికి వచ్చుసరికిఁ గన్నులు పోయినవి. వాఁడా బ్రాహ్మణులతో నెక్కుడుగాఁ గలహించి వారిం దిరస్కరించుకొఱకు ముట్టవలదనుచుండ నాశవమునుఁ బాదముతో దాకెను అదియేకదా మూఢత్వము, గర్వము యుక్తాయుక్తవివేకము గలుగనీయదు. ఆ సాధువును దహించినందుకు మాకేమి ముప్పువచ్చునో యని వెఱచుచున్నవారము. ఇదియే మాయెఱిగించు విజ్ఞాపనమని చెప్పి యాదూతలు తమ నెలవునకుంబోయిరి.

అప్పు డామంత్రు లొండరు లాలోచించుకొని యోహో! అతండే యీతండు. వీండ్రుచెప్పిన సమయమున రాజు సమసిన సమయము నొక్కటియేయైనది. మన మనుకొనినట్లే జరిగినవి. ఈ గాయకు లాతనికాప్తులై యుందురు. వీరిలో వీరి కెద్దియో సాంకేతికము గలిగియున్నది. ఏది యెట్లైనను వీరి నిఁక మనము నిర్బంధింపరాదు. వీరు మహాత్ములని తద్గీతములే చెప్పుచున్నవి. అని నిశ్చయించి యప్పుడే పద్మపాదాదుల రప్పించి యపరాధముఁ జెప్పికొనుచు యథేష్టగమనంబున కనుమతించిరి.

పిమ్మటఁ బద్మబాదాదు లతిరయముగా నరశింహశైలమున కరుగుచుండ దారిలోఁ గొందరు శిష్యు లెదురుపడి యెహో మీరింత జాగుచేసితిరేల? మన గురువు గారు జీవించిరి. మీరాక కెదురుచూచుచున్నారు. కొందరుక్రూరులు మేమున్న గుహకు వచ్చి యందాచార్యశరీరమునుఁ జూచి దహింపఁజేయ దొడంగిరి. ఇంతలో నమ్మహానుభావుండు శరీరమునఁ బ్రవేశించెను. దగ్ధములైన యవయవముల రక్షించుటకై నరహరి స్తుతి గావించి తత్ప్రసాదంబున నగ్నిబాదం బొరయక యథాపూర్వావయములతో విరాజిల్లుచున్నారు. తత్కృతస్తుతిశ్లోకంబుల మేమెల్లరము వర్ణించితిమి. మిక్కిలి వైరాగ్యోపభోదకములై యున్నవి వినుండు.