పుట:కాశీమజిలీకథలు-05.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నొక విశేషము జరిగినది వినుడు. అతనికి నాభేటనక్రీడయందు మిగులవేడుక యగుటచే నా జనపతి తరచు వేటలాడుచుండును. కొన్నినెలలక్రిందట నొకమహారణ్యములో గ్రూరసత్త్వములు మిక్కుటముగా నున్నవని విని కతిపయపరిచరపరివృతుండై గుర్రమెక్కి యత్కాంతరమునకుం జని యజ్జనపతి యొకచెట్టుక్రిందం గూర్చుండి యర్ధరాత్రంబునం మృగములజాడ నరయుచుండెను,

అంతలో నత్యంతశిరోవేదన యావిర్భవించుటయు నా వ్యధ సైరింపలేక యాతరువుక్రింద బరిచారిక విరచితపత్రశయ్యను శయనించి యారాజ పంచాననుండు వారు చూచుచుండగానే రెండుగడియలలో బంచత్వము నొందెను. అట్లు విగతచేతనుండై పడియున్న యన్నరపతిం జూచి చింతాసంతాపితస్వాంతులై కింకరు లార్తనినాదములతో వచ్చి యవ్వార్త నిప్పురంబంతయు వెలయజేసిరి. అమరుకుండు రూపయౌవనకళాన్వితలగు యువతుల నేరి నూర్గుర బెండ్లియాడియున్నవాడు. కావున వారెల్ల నయ్యుపద్రవమును వినినతోడనే కరవాలఖండితకదళీప్రకాండంబువోలె నేలం బడి దారుణశోకాయత్తములగు చిత్తముల నుత్తలమందుచు మంత్రిసామంతపౌరదాసదాసీజనంబులు వెంట నరుదేర నప్పు డయమ్మహారణ్యంబునకుం బోయి యం దొకచెట్టుక్రింద స్వర్గపదభ్రష్టుండైన పుణ్యపురుషుండువోలె నేలంబడియున్న యన్నరేంద్రుం గాంచి యక్కాంచనగాత్రులొక్క పెట్టున నయ్యరణ్యంబు ప్రతిధ్వనులీయ నతని గాత్రముపైఁ బడి యేడవ దొడంగిరి. రెండుదినంబు లేకరీతి నట్లు నిద్రాహారంబులు మాని యమ్మించుబోణు లానృపతి కళేబరము విడువక శోకించిరి. అప్పుడు మంత్రు లెట్టకేని వారినూరడింపుచు నిఁక శరీరము నిలువదు. ఇతండు పుణ్యపురుషుండు. అగ్నిసంస్కారములు గావింపవలయునని పలికి యథాశాస్త్రముగా సంస్కారములు గావింపఁ జేసి యతని శరీరమును జితిపై నెక్కించిరి.

అట్టిసమయమున నే నందే యుంటిని. తత్కాంతారత్నమునెల్ల జితివిడువక మమ్ముఁగూడ నిందుఁ గప్పిఁ యగ్గినంటిపుఁడని పలుకుచుండ మంత్రులు వారించుచు వారినూరడించి తీసికొనిరండని తగువారిని నియమించుచుండిరి ? అంతలో నమ్మేదినీకాంతునియంగము గదలినట్లు పొడకట్టినది. అత్తెఱఁగరయ నత్తరుణులు రొదచేయక యట్టే నిలువంబడి చూచుచుండఁ గొండొకవడిక్కి నూపిరి విడుచుచున్నట్లు తోచుటయు సంభ్రమముతో నుండుఁడు ఉండడు. మనపుణ్యము బయలుపడ చున్నట్లున్నది. అనిపలుకుచుజేతులుసాపుచు బరీక్షింపుచుండ నిట్టూర్పు నిగడింపుచు నొత్తిగిల్లెను. అప్పుడు రాజు బ్రతికె బ్రతికె నను నినదము లయ్యారణ్యమంతయు వ్యాపించినవి. పిమ్మట నమ్మనుజపతియు నిద్రించి మేల్కొనినట్లు లేచి కూర్చుండి కన్నుల నులిమికొనుచు నేమి యిట్లేడ్చుచున్నవారని యడిగెను అప్పు డప్పడఁతులు ప్రాణనాథునిపైఁ బడి యేడ్చుచు దద్వృత్తాంతమంతయుం జెప్పిరి తరువాత నాభూనేత వారినెల్ల నోదార్చుచు నమా