పుట:కాశీమజిలీకథలు-05.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

107

పద్మపాదు :- అయ్యో! రాహుగ్రస్తుం డైనను జంద్రుండు తత్ప్రకాశగుణములచే దెలిసికొనబడుచుండలేదా? అమ్మహాత్ముని యునికి తద్గుణములే వెల్లడి చేయగలవు.

చిత్సుఖుడు :- సందేహమేల? మేఘచ్ఛన్నుండైనను సూర్యుని తేజము తెల్లముగాకున్నదియా?

పద్మ :- మన్మథకళాపాండిత్యము సంపాదింప నకాముఁడైనను కామినీజనప్రియమగు శరీరమును ప్రవేశించియుండబోలు. అతం డుండుదేశమున బ్రజలకు రోగశోకాదిబాధలు గలుగక నిత్యతృప్తులై స్వధర్మనిరతులై యుందురు. వర్షములు చక్కగా వర్షించును. భూమి తృణకాష్ఠజలసమృద్ధి గలిగియుండును. ఇవియే గురుతులు.

చిత్రభానుడు :- అట్లైన నాలస్య మేమిటికి? యిప్పుడే పోవుదము రండు. వృథా కాలక్షేపము చేయనేల?

పద్మపాదు :- ఆచార్యశరీరము రక్షించుచు గుణనిధ్యాది విద్యార్ధు లిందుండవలయును. మనమందరము వెదుకవలయు నిదియే నా యభిప్రాయము.

చిత్సుఖు :- అందులకు మేమందరము సమ్మతించితిమి. అని యొండొరులు మాట్లాడికొని పద్మపాదాది శిష్యులందు గొందరినుంచి గురు నన్వేషించుతలంపుతో నక్కొండ దిగి యా ప్రాంతారణ్యభూముల నరసికొనుచు నరిగి యరిగి కనంబడిన గ్రామములలో నెల్ల విశేషముల నడిగి తెలిసికొనుచు దేశాటనము గావింపుచుండిరి.

గీ. శంకరాచార్యశిష్యు లాశ్చర్యలీలఁ
   బురనదీపక్కణారణ్యభూము లట్లు
   వెదకికొనుచును ధిక్కృతవిబుధదేశ
   ములగు నమరుకనృపదేశములకుఁ జనిరి.

తచ్ఛాత్రోత్తము లద్దేశంబు సంపన్నత్వంబు గాంచి వెరగుపడుచు గ్రమంబున దద్రాజధాని కరిగి యొకభూసురుని యింటి కతిథు లగుటయు నతండు వారి నుచితసత్కారంబుల నాదరింపుచు మృష్టాన్నసంతృప్తులం గావించి పిమ్మట వినయముతో వారి కిట్లనియె. అయ్యా! మీ నివాసదేశ మెచ్చట? ఎందుబోవుచున్నారు? ఇచ్చటి కేమిటికి వచ్చితిరి? భవదీయచరణరజస్సంపర్కమున మద్దేహంబు పవిత్రమైనదిగా! యని యత్యంతస్తోత్రపూర్వకముగా నడిగిన విని యా శిష్యులిట్లనిరి. గృహమేధీ! మాది కాశీదేశము. గుదువిత్తార్ధులమై మేము వచ్చితిమి. యీ దేశ మెవ్వరిది? తన్నామధేయ మెట్టిది? మీ రాజు పండితుల గౌరవించునా? సరసత్వ మున్నదియా! అతం డేవిద్యయం దిష్టము గలవాడు? ప్రాయ మెంత? విశేషము లేమి? యని యడిగిన విని యాబ్రాహ్మణుం డిట్లనియె, ఆర్యులారా? అమరుకుండను నృపాలుం డీదేశమును బాలించుచున్నాడు. అతనిని గడుధర్మాత్ముండనియే చెప్పదగినది. యీ నడుమ