పుట:కాశీమజిలీకథలు-05.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

109

త్యాదిమిత్రవర్గముతోఁ గూడికొని మెండువేడుకతో వెండియు నిప్పురి కరుదెంచి పట్టాభిషిక్తుండై రాజ్యము గావింపుచుండెను. నాటంగోలె నానృపతి పుటంబువడిన పసిండి వోలె వన్నెగలిగి యత్యంతతేజంబు మెఱయ నొప్పుచుండెను. ప్రజలు రోగశోకాదివ్యధలు వహింపక ధర్మతత్పరులై మెలంగుదురు. ఇదియే మానృపతి వృత్తాంతము. మరియు భార్యల సంతసపరుప నిప్పుడు రాజ్యంబు మంత్రుల యధీనముఁజేసి తాను కేళీశైలంబున విహరింపుచున్నవాఁడు. శృంగారలీలాకలాపంబున నానందింపుచు భార్యలతో వేడుక లనుభవింపుచుండుటంబట్టి యిప్పుడు మీవంటివా రాయనను దర్శించుటకు సమయముకాదు. సంగీతవిద్యాప్రవీణులకు గాక యితరులకు నమరుకుం డవసర మిచ్చుటలేదని వాడుకయున్నది. ఇదియే నాయెరింగిన వృత్తాంతమని చెప్పి బ్రాహ్మణుం డూరకుండెను.

ఆ కథవిని పద్మపాదాదు అత్యంత సంతోషసాగరంబున మునుంగుచు అవును నాఁడు నాతో నతనిపేరే చెప్పిన జ్ఞాపకము. అయ్యారే మనయయ్యవారే యితండు సందియములేదు. తరుణీసక్తుండై యున్నవాఁడని యొండొరుల చెప్పుకొనుచు వీణలు సంపాదించుకొని గాయక వేషములు వైచుకొని గీతంబులఁ బాడికొనుచు నప్పట్టణవాసులనెల్ల రంజింపజేయుచుఁ గ్రమంబున నానృపాలుని శ్రుతిపథంబుఁ బ్రవేశించి యతనిచే నాహూయమానులై యొకనాడు తదాస్థానమున కరిగి యందు,

సీ. ఇరుగెలంకుల నిల్చి కరకంకణధ్వనుల్
            బరగఁ జేడియలు చామరము లిడఁగ
    ధర్మదండసితాతపత్రరత్నద్యుతు
           ల్మకుటమాణిక్యదీపికలఁ బెనుప
    శరదిందుముఖులు కొందరు ముందరను గాన
           తాసస్వనముల నుత్సవము సేయ
    వాకామిను లొక్కవంక శృంగారలీ
          లాతిచాతుర్యనృత్యములు జరుప

గీ. ఆకృతిం గని భువిఁ జేరినట్టి మదనుఁ
   డనఁగ యువతీతాళవృతుం డగుచుఁ దార
   కావృతుండగు హిమకరుకరణిఁ గొలువు
   కూటమున నొప్పు నృపుఁ గనుగొనిరి వారు.

కనుంగొని తదీయశృంగారలీలావినోదంబుల కచ్చెరువందుచుఁ దదాజ్ఞ నందరు నుచితపీఠంబులం గూర్చుండి యాసభాసదులన పూర్వగాంధర్వవిద్యాకౌశలంబున మోహింపంజేయుచు భృంగకైతవంబున నమ్మహారాజున కి ట్లాత్మవృత్తాంతంబు బోధపరచిరి.