పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కేళికినై శుకాకృతు లొగి ధరియించి మెలంగునాజగ
న్మూలనిదానదంపతుల మువ్వురిలోపల నొక్కరో దయా
శీలత మన్మనోరథము చేరి యొసంగఁగ వచ్చినట్టి మా
పాలిటిభాగ్యదేవతలొ పల్కఁదగున్ భవదీయవృత్తమున్.

176


వ.

అని వినయభాషణంబులు పలుకుచున్న యన్నుల నవలోకించి కించిత్ప్రసారిత
నిజకటాక్షవీక్షణుం డగుచుఁ బక్షివరుంఁ డిట్లనియె.

177


సీ.

మానివాసము ముక్తిమౌనివాసం బైనబదరికావనసీమ భామలార
మామైత్రి యలకరామామైత్రిఁ బేరైన శుకతల్లజముతోడ సుదతులార
మాయింపు ఖేదముల్ సూయింపు భగవత్కథాప్రసంగంబులు తరుణులార
మానేత్రములకును మానేత్రజాదిలోకములు దృశ్యంబులు కాంతలార


తే.

మానిజగతి దుస్సంగతి మాని జగతి, సత్ప్రచారతనుండుట సకియలార
మాహితప్రోక్తి వినుఁడు సమాహితమున, మీకు శుభవార్త పలికెద మెలఁతలార.

178


ఉ.

ఊర్వశి పాకశాసనునియోగమునన్ భువికేగు నచ్చట
సర్వగుణాభిరాము నృపచంద్రు బురూరవుఁ గాంచు నాతఁ డీ
పర్వశశాంకబింబముఖిపైఁ గడుఁ గూర్మివహించు మామకా
శీర్వచనంబు సిద్ధముగఁ జేకుఱు నిద్దఱకున్ సరాగముల్.

179


ఉ.

చంద్రనిభాస్య కానృపతిచంద్రునితో సతమైనకూటమిం
జంద్రునియందు లీయమగు చంద్రికయుం బలెనుండఁ గల్గెడుం
జంద్రవిలాసమూర్తు లగుచక్కనిపుత్రులఁ గాంచు భూమిలోఁ
జంద్రకులంబు వర్ధిలు నిజంబుగ నూర్వశికారణంబునన్.

180


వ.

అచిరకాలంబున నీమనోరథంబు సాఫల్యం బగునని యూర్వశి నుద్దేశించి యిట్లనియె.

181


శా.

మానారాయణమూర్తియూరువున జన్మంబందుటం జేసి నీ
పై నెయ్యంబున నింతయం తెలిపితిన్ భాగ్యంబుచే నీకు నా
భూనాథాగ్రణి మేలువాఁడగును నీపుణ్యంబు లీడేఱు బా
లా నిశ్చింతతనుండు మింక వగ పేలా నీకు మేలయ్యెడున్.

182


క.

అని పలికి తానుఁ బ్రేయసి, యును నవ్వలనరుగఁ దగుప్రయోజనము ముదం
బునఁ దెలిపి పోయివచ్చెద, మని చెప్పి సముద్గమించె నంబరవీథిన్.

183


తే.

ఉభయపక్షప్రకాశత నొప్పుచక్ర, విభ్రమణలీల లెసఁగించు విషమజాడ్య
కరగతి నయంబు దనర శుకప్రకాండ, మవగుణము లేని శశియన నరిగె దివిని.

184