పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

చిలుకమిథునంబు వెంట నాచెలులచూపు, లపు డదృశ్యావధికముగ నరిగి తిరిగె
సాధు లగుబంధువుల దవ్వు సాగనంపి, వచ్చు టుచితంబుగద గుణవంతులకును.

185


క.

 చిలుక సుధారసధారలు, చిలుక వచించిన హితోక్తి చెవిఁ జేర్చుటచే
వెలవెల దొలంగి వేలుపు, వెలవెలఁదికి మోముదమ్మి వికసిత మయ్యెన్.

186


వ.

అప్పుడు.

187


సీ.

తడిగట్టినట్లు చందనకర్దమంబు వాడినతనూలతమీఁద నెనయ నలఁది
యరుణోదయము గాఁగ నబ్జరాగపుతాళి సొలసినకుచకోకములను జేర్చి
మకరంద మొలుకు కమ్మనిపూలు చెదరిన కొప్పు తుమ్మెదగుంపుఁ గూర్చి చుట్టి
చీఁకటి కప్పుగాఁ జెలఁగు కాటుక కాంతనయనోత్సలముల నందముగఁ దీర్చి


తే.

విరహవేదన బడలిన వెలఁదియంగ, కముల కుపచార మదియె శృంగార మదియె
తానొనర్చిరి తెలిసి యేకక్రియాప్తి, నావయస్యలనేర్పు నేమనఁగవచ్చు.

188


క.

అంగీకృతకాలోచిత, శృంగారవిలాస యగుచుఁ జెలికత్తెలతో
రంగగు నిజమందిరమున, కంగన యేతెంచెఁ గోర్కు లతిశయమందన్.

189


ఉ.

ఇంద్రుఁ డనుజ్ఞ యిచ్చుపని యెయ్యది గల్గునొ భూమి కేగ రా
జేంద్రునిదర్శనంబు ఘటియించుట యెట్లొకొ వాఁడు మన్మన
స్సాంద్రతరానురక్తికి వశంగతుఁడౌట కుపాయమేమొ ని
స్తంద్రతఁ జిల్కపల్కులు నిజంబగునో యది గాక తప్పునో.

190


వ.

అని విచారింపుచు.

191


సీ.

అభిలాష మీ డేఱు ననుచు నమ్మికగాఁగ నాడిన చిలుకవాక్యములవలనఁ
దఱుచైన కలలోని దర్శనస్పర్శన సంజల్పసంయోగసరణివలన
నతనిము న్గనుఁగొన్న యమరశిల్పకులు వ్రాసినపటం బెద నుంచుకొనుటవలనఁ
దలఁచి కావించునోములసమాప్తిని, బుణ్యవతులు దీవించుదీవనల వలన


తే.

వామలోచన యాత్మీయవామలోచ, నం బదరు టాదిగా శకునములవలనఁ
దెచ్చుకోలుదిటంబున దినములొక్కఁ, గతిఁ గడుపుచుండె మనసు తద్గతము చేసి.

192


క.

భువిఁ బుణ్యము లొనరింతురు, దివిభోగము లందుకొఱకుఁ దిరముగ వ్రతముల్
దివినుండి చేసె నూర్వశి, భువిభోగముకొఱకు నిది యపూర్వము గాదే.

193


వ.

అని పలికినం బరమహర్షసమన్వితులై మహర్షు లవ్వలివృత్తాంతంబు దేటపఱు
పుమని యడుగుటయును.

194