పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆకొమ్మఁ దమకుఁ బెద్దగ, గైకొని యేతెంచి రమరకాంతలు దివికిన్
లోకస్తుతసుందరియై, నాకంబునఁ బెంపుగనియె నాటంగోలెన్.

166


మ.

ఇది యీయూర్వశి పూర్వవృత్త మిపుడీహేమాంగి గందర్పతా
పదశంజెందెఁ బురూరవున్ వలచి తత్ప్రస్తావముల్ చాల నా
రదుచే విన్నదియై యెఱుంగుదువె యారాజేంద్రునిం జూతుమే
కద నారాయణసేవకై యతఁడు రాఁగా నవ్వనిన్ జవ్వనీ.

167


వ.

అని పలుకుచున్న జీవితేశ్వరువచనంబు లాలించి యించుకతఁడు తూష్టీకత్వంబున
విచారించి శిరఃకంపంబు సేయుచుఁ గీరభామిని యిట్లనియె.

168


క.

అగునగు నెఱుఁగుదుఁ బ్రియకర, మగుమగువల కతనియంద మకలంకశశి
న్నగునగుమొగ మీయింతికిఁ, దగు దగు నిద్దఱకుఁ జెలిమి తమిఁ గ్రీడింపన్.

169


మ.

అను నీముచ్చట ప్రస్ఫుటాక్షరరవవ్యాహారమై కర్ణరం
జన గైర్వాణసుశబ్దమై వినఁబడం జంద్రాస్య లాశ్చర్యఖే
లనలోలద్వికచాంబికప్రభలు లీలాచంద్రికల్ చల్లఁ గ
న్గొని రాసన్నరసాలశాఖ నలరుంగొమ్మన్ శుకద్వంద్వమున్.

170


ఉ.

కీరములన్ మనోజ్ఞరుచిఖేలనవర్ణవిశేషశోభితా
కారములన్ నవారుణముఖప్రథితాత్మగతానురాగవి
స్తారములన్ జనశ్రుతిరసాయనమంజులవాక్కథాసుధా
పూరములన్ గనుంగొని రపూర్వముదంబున నూర్వశీసఖుల్.

171


వ.

ఇవ్విధంబున.

172


మ.

మణిమంజీరఝళఝుళన్నినదసంపన్నాంఘ్రివిన్యాసవా
రణకుంభప్రతిమానపీనకుచభారప్రోచ్చలన్మధ్యలై
గణికల్ తత్సహకారముం గదిసి శోభాచంక్రమాక్షిద్వయీ
ఘృణు లుడ్డీనచకోరికాచయజయశ్రీ నొంద వీక్షింపుచున్.

173


వ.

నిలిచి తత్తేజోవిశేషంబున కద్భుతం బందుచుం బ్రార్థనావచనపూర్వకప్రాంజలులై
కీరోత్తముం గనుంగొని.

174


ఉ.

కన్నుల పండువయ్యె నినుఁ గన్నఁ జెవుల్ కడుచల్లనయ్యె ఠీ
వి న్ననువొందునీపలుకు విన్నను నీకరుణార్ద్రదృష్టిపై
కొన్న వసంతలక్ష్మి నెలకొన్న లతావళు లయ్యె మేనులో
యన్న శుకప్రకాండ విను మన్నిటఁ బుణ్యశరీరి వెన్నఁగన్.

175