పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అలయికదీఱ జాతసుఖుఁడై నిజచంచుపుటంచలాహతిన్
గళితములైన పక్వసహకారఫలంబులమాధురీరసం
బెలమి భుజించి తాను దనయింతియుఁ దృప్తివహించి యచ్చటం .
గలుగువినోదముల్ మఱియుఁ గన్గొనుచున్ విహరించి యొక్కచోన్.

157


ఉ.

వాడినమోముతోఁ జెమటవానలఁ దోఁగిన చన్నుదోయితో
వీడినకొప్పుతోఁ బొడము వెచ్చనియూర్పులతోఁ గరాబ్జముం
గూడినచెక్కుతో వగలఁ గూరెడుచిత్తముతో మరుండు వే
టాడఁగఁ జిక్కువడ్డమృగియై బెగడొందుచు నున్నయూర్వశిన్.

158


తే.

సఖులు గావించునుచితోపచారములకుఁ, జెలులు ధైర్యంబు దెలిపెడుపలుకులకును
మనసు గొలుపక హా దైవమా యటంచు, విసువుకొనుచున్న యవ్వెలవెలఁదిఁ జూచి.

159


వ.

కటకటంబడుచు శుకాంగన మనోహరున కిట్లనియె.

160


ఉ.

అక్కట యీలతాంగి సకలావయవంబులు చూడ నెంతయున్
జక్కఁదనంబు లొచ్ఛెమగుచంద మొకించుకయైన లేదు ముం
దెక్కడఁ జూడలేదు నిజ మిట్టివిలాసిని నేమికారణం
బొక్కొ మనోవ్యథం బొరలుచున్నది చూచితె ప్రాణనాయకా.

161


తే.

నాథ యీయింతి జూచిన నామనంబు, జాలిగొనియెడు మీపదాబ్దంబులాన
వినఁదగుదునేని తెల్పుఁడు విశ్వమునను, మీరెఱుం గని కార్య మేమియును లేదు.

162

త్రైలోకవర్తి యనుచిలుక తనచెలికి ఊర్వశివృత్తాంతముఁ దెల్పుట

క.

అని పలికిన ప్రియురాలిం, గనుఁగవ నుల్లాసరసవికాస మెసంగం
గనుగొని యిట్లనిపలికెన్, వినుమని మాధుర్యరచన విలసన్ముఖుఁ డై.

163


సీ.

పరమపావనమైన బదరికావనమున నిశ్చలంబుగఁ దపోనిష్ఠ సలుపు
చున్న నారాయణయోగీంద్రు నియతి విఘ్నము సేయ గీర్వాణనాథుఁ డంప
నమరాంగనలు వచ్చి హావభావవిలాసములు చూపుదును దనమ్రోల మెలఁగఁ
గాంచి నవ్వుచు నఖాగ్రంబులఁ దన తొడ చీఱి యం దభినవశ్రీయుతాంగి


తే.

నివ్వరారోహఁ గల్పించి యవ్వినోద, మునకు లజ్జాభయంబుల మునుఁగుచున్న
యచ్చరలఁ జూచి మీ చేష్ట లతివలార, యిచట నేమగు మఱలిపొం డింద్రుకడకు.

164


క.

అని తనయూరువున జనిం, చినదగుటన్ దరుణి కూర్వశ్రీనామముఁ దా
నొనరించి ముఖ్యురా లగు, ననిమిషసతులార మీకు ననుచు నొసంగెన్.

165