పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మలినశరీరులై మిగుల మత్తతనుండఁగఁ దేఁటులార పె
ద్దలు మధుపంబు లుందురుగదా మిము దుర్గుణమిట్టిదే కదా.

147


క.

రణసీమ నెట్లు నిలుతురొ, గణుతింపఁగఁ దేఁటులార కామునివింటన్
క్షణచిత్తులు మీ రతఁ డే,గుణము విచారించి మిమ్మ గుణముంజేసెన్.

148


క.

అలికుంతల మీనామము, వెలయం దలమోచి యున్నవిశ్వాస మయో
తలపున నుంచక పలుకూఁ, తలచే నీగతి నలంచఁదగునే తరుణిన్.

149


వ.

అని యివ్విధంబున.

150


తే.

ఇందుముఖు లిందుకందర్పమందగంధ, వాహశుకపికభృంగసందోహముఖ్య
శత్రుపక్షంబు నిందించి సకియభయము, దీఱ నూఱడఁబల్కి రుదారఫణితి.

151

ఊర్వశిని సఖు లూఱడించుట

సీ.

సంపెంగకైదువ సవరించుమరునితో హర్షించనేర్చునే యళికులంబు
రామనామోక్తిచే రంజిల్లుచిలుకలఁ గూడివర్తించునే కోకిలములు
హరుని నెమ్మేనఁ బాయక యున్నకుముదాప్తు నాప్తుఁగాఁ జూచునే యసమబాణుఁ
డాదిత్యబింబోదయముగోరుతమ్ముల హితులుగాఁ దలఁచునే హిమకరుండు


తే.

వారివారికి నన్యోన్యవైరవృత్తి, గలుగుటకు నిట్లు హేతువుల్ గలుగుటెల్ల
శత్రుపక్షంబునకు నపజయకరంబు, గాన నీకేల వెఱపింపఁ గమలనయన.

152


ఆ.

కాముఁ డనఁగ నెంత గండుఁగోయిల యెంత, సోముఁ డెంత గాలి నేమ మెంత
భీము రాము గాముఁ బాముఁ బ్రార్థించిన, భామ వారి గర్వభంగ మగును.

153


వ.

అని యివ్విధంబున నాజవ్వని నూఱడింపుచుండి రయ్యవసరంబున.

154


సీ.

బదరికావనభూమిఁ బరమాత్ముఁడైన నారాయణదేవుని నాశ్రయించి
వర్తించుఁ త్రైలోక్యవర్తి నామమున నొక్కశుకోత్తమంబు త్రికాలవేది
సత్యలోకంబున శారదారమణి ముంజేతిపైనుండు రాచిలుకతోడి
బాంధవంబునఁ జేసి పడఁతియుఁ దానుఁ దర్సందర్శనార్థంబు చనుచునుండి


తే.

యమరపురిమీఁదుగాఁ బోవునపుడు నయన, గోచరం బగునూర్వశీకోమలాంగి
తోఁటసౌకర్యమునకు సంతోషమంది, యింతతడ విందు నిలుతమే యింతి యనుచు.

155


ఉ.

పల్లవపుష్పగుచ్ఛఫలబంధుర మైనరసాలశాఖపైఁ
జల్లఁదనంపుసొంపు వెదచల్లెడు కొమ్మకుఁగొమ్మతోడఁ దా
నల్లన జేరి నిల్చి తదుపాంతసరోవనశీతవాతపో
తోల్లసనాప్తికై యెఱక లొయ్యన విచ్చుచు సొక్కి మెచ్చుచున్.

156